స్పుత్నిక్‌–వి పంపిణీ హక్కులు ఎవరికీ ఇవ్వలేదు

29 May, 2021 00:31 IST|Sakshi

డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ స్పష్టీకరణ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  దేశంలో స్పుత్నిక్‌–వి వ్యాక్సిన్‌ బ్రాండ్‌ సంరక్షణ బాధ్యత తమ సంస్థకే ఉందని డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ స్పష్టం చేసింది. పంపిణీ హక్కులు ఏ కంపెనీకి అప్పగించలేదని శుక్రవారం వెల్లడించింది. తొలి 25 కోట్ల డోసుల పంపిణీ బాధ్యత తమదేనని తెలిపింది. ఈ మేరకు రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌తో (ఆర్‌డీఐఎఫ్‌) కలిసి డాక్టర్‌ రెడ్డీస్‌ సంయుక్త ప్రకటన వెలువరించింది. ‘జూన్‌ మధ్యలో స్పుత్నిక్‌–వి వ్యాక్సిన్‌ వాణిజ్యపరమైన విడుదల నేపథ్యంలో భాగస్వామ్యం కోసం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో నేరుగా చర్చిస్తున్నాం.

వ్యాక్సిన్‌ కోసం పలు కంపెనీలు, థర్డ్‌ పార్టీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టుగా ఆధారాలు లేని నివేదికలు, వాదనలు కొన్ని రోజులుగా జరుగుతున్నాయి. నివాస సంఘాలకు వ్యాక్సిన్‌ సరఫరాకు ఏ కంపెనీతో మేము భాగస్వామ్యం కుదుర్చుకోలేదు. మా తరఫున వ్యాక్సిన్‌ సరఫరాకు ఎవరికీ బాధ్యతలు అప్పగించలేదు. అనధికార వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. కంపెనీ ప్రతినిధులమంటూ ఎవరైనా సంప్రదిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి. స్పుత్నిక్‌–వి పేరుతో మోసాలకు పాల్పడే వ్యక్తులపట్ల చట్టపరమైన చర్యలు తీసు కుంటున్నాం. అనధికార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు, నకిలీ ఉత్పత్తులకు కంపెనీ బాధ్యత వహించదు’ అని డాక్టర్‌  రెడ్డీస్‌ స్పష్టం చేసింది.  

>
మరిన్ని వార్తలు