40 అంతస్థుల ట్విన్‌ టవర్స్‌ కూల్చివేతలో మరో ట్విస్ట్‌!

28 Apr, 2022 15:35 IST|Sakshi

నిబంధనలు అతిక్రమించి ఢిల్లీలోని నోయిడాలో నిర్మించిన ట్విన్‌ టవర్స్‌ కూల్చివేతలో చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఈ ట్విస్ట్‌ కారణంగా సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేయలని పరిస్థితి ఎదురయ్యింది. దీంతో తప్పు మాది కాదంటే మాది కాదంటూ ఒకరి తర్వాత ఒకరు తెర మీద నుంచి తప్పుకుంటున్నారు. తాజా మలుపులపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి!

నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ పరిధిలోని నోయిడా సెక్టార్‌ 93లో సూపర్‌ టెక్‌ అనే రియాల్టీ సంస్థ నిబంధనలు తుంగలో తొక్కి 40 అంతస్థుల జంట భవనాలు నిర్మించింది. దీనిపై అలహాబాద్‌ కోర్టు మీదుగా సుప్రీం కోర్టు వరకు వివాదం నడిచింది. చివరకు నిర్మాణ సంస్థదే తప్పుగా తేల్చిన కోర్టు 2022 మే 22న రెండు జంట భవనాలు కూల్చివేయాలని ఆదేశించింది. అదే విధంగా నోయిడా అధికారులకు తలంటింది.

టెస్ట్‌ బ్లాస్ట్‌
ట్విన్‌ టవర్స్‌ కూల్చివేత పనులను ఎడిఫైస్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ డిమాలిషన్‌ సంస్థ చేజిక్కుంచుకుంది. ఆ తర్వాత భవనాల కూల్చివేత పనులు పరిశీలించేందుకు టెస్ట్‌ బ్లాస్ట్‌ని 2022 ఏప్రిల్‌ మొదటి వారంలో నిర్వహించింది. ఇక మే 22న జంట భవనాలను నాలుగు వేల కేజీల మందుగుండు సామగ్రితో పేల్చివేయడమే తరువాయి అనే సమయంలో ఎడిఫైస్‌ సంస్థ షాక్‌ ఇచ్చింది.

ప్లేట్‌ ఫిరాయించిన ఎడిఫైస్‌
నోయిడాలోని ట్విన్‌ టవర్లను కూల్చి వేసేందుకు తమకు కేటాయించిన సమయం సరిపోదంటూ కొత్త రాగం అందుకుంది. సుప్రీం కోర్టు నిర్దేశించిన గడువులోగా (2022 మే 22)న భవనం కూల్చివేయలేమని, తమకు మరో రెండుమూడు నెలల సమయం కావాలంటూ చెబుతోంది. చుట్టు పక్కల ఉండే వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా భవనాలను కూల్చివేయాలంటే తాము మరింత సాంకేతిక సామర్థ్యం సమకూర్చుకోవాలంటూ తెలపింది. ఎడిఫైస్‌ సంస్థ ఒక్కసారిగా ప్లేట్‌ ఫిరాయించడంతో నోయిడా అధికారుల నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టయ్యింది.

మాకు సంబంధం లేదు
ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా 40 అంతస్థుల భవనం కడుతుంటూ చూస్తూ ఊరుకున్నారంటూ సుప్రీం కోర్టు నోయిడా అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో జాప్యం జరిగితే ఎటువంటి పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందోనని కిందామీదా అవుతున్నారు. భవనం కూల్చివేతతో తమకు సంబంధం లేదని.. అదంతా బిల్డరే చూసుకోవాలని చెబుతున్నారు. తాము కేవలం కూల్చివేత పనులను పర్యవేక్షిస్తామంటూ చెబుతున్నారు.

కుట్ర ఆరోపణలు
ట్విన్‌ టవర్స్‌ కూల్చివేత విషయంలో కావాలనే జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బిల్డర్ల ప్రయోజనాలు కాపాడేందుకు కొత్త అంశాలను తెర మీదకు తెస్తున్నారంటున్నా ట్విన్‌ టవర్‌ సమీప ప్రజలు. రెండు నెలలుగా సాంకేతిక అంశాలపై నోరు విప్పకుండా ఈ రోజు అదనపు సమయం కావాలని అడగటం కుట్రలో భాగమని ఆరోపిస్తున్నారు ఈ కేసులో ప్రతివాదులు. దీంతో ఈ కేసులో సుప్రీం కోర్టు తదుపరి చర్యలు ఎలా ఉండవచ్చనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

చదవండి: 40 అంతస్థుల జంట భవనాలు కూల్చేస్తారా లేక జైళ్లో పెట్టమంటారా ?

మరిన్ని వార్తలు