Noida Twin Towers: ట్విన్‌ టవర్ల కూల్చివేతకు రంగం సిద్ధం: భారీ తరలింపులు, హై టెన్షన్‌!

28 Jul, 2022 17:21 IST|Sakshi

న్యూఢిల్లీ:నోయిడా వివాదాస్పద, అక్రమ  జంట టవర్ల కూల్చివేతకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 21 న నోయిడాలోని సెక్టార్ 93Aలో సూపర్‌టెక్  జంట టవర్లు అపెక్స్ (32 ఫోర్లు), సెయానే (31 ఫోర్ల)కూల్చివేతకు రంగం సిద్దమైంది. టన్నుల కొద్దీ పేలుడు పదార్థాలతో దాదాపు 100 మీటర్ల ఎత్తైన ఈ టవర్లను ఎడిఫైస్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో నేలమట్టం చేయనున్నారు. ఎంపిక చేసిన  నిపుణుల సమక్షంలో  ఆగస్ట్ 2 నుండి ఆగస్టు 20 వరకు ఈ  జంట టవర్లను పేలుడు పదార్థాలతో నింపుతారు. అనంతరం ఆగస్టు 21 మధ్యాహ్నం 2.30 గంటలకు క్షణాల్లో వీటిని పూర్తిగా కూల్చివేయ నున్నారు.

నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు జరిగాయని గత ఆగస్టులో సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన అనంతరం ఈ పరిణామం జరగనుంది. అలాగే సుప్రీం ఆదేశాల మేరకు గృహాలను కొనుగోలు చేసి మోసపోయిన వారికి సంబంధిత నగదును వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి ఫ్లాట్లలో నివసిస్తున్న వారిని తరలించేందుకు అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. నోయిడాలో సూపర్‌టెక్ అక్రమ జంట టవర్లలో 1,396 ఫ్లాట్లలో నివసిస్తున్న దాదాపు 5 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. దీంతో చుట్టుపక్కల నివసిస్తున్నవారిలో ఆందోళన నెలకొంది.

అంతకుముంద జూలై 27నాటి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్, పోలీస్ ఆర్‌డబ్ల్యుఎలతో నోయిడా అథారిటీ, పోలీసులు, ఇతర అధికారుల సమావేశంలో తరలింపు ప్రణాళిక, భద్రతా వివరాలను చర్చించారు. ఈ మేరకు ఆగస్టు 14న  కూల్చివేతకు సంబంధించిన పూర్తిస్థాయి డ్రెస్ రిహార్సల్ నిర్వహించనున్నట్లు నోయిడా అధికారులు తెలిపారు. ఈ ప్రాంగణంలో రెడ్ జోన్‌గా ప్రకటించారు. అంతేకాదు నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలని  కేంద్రం అనుమతి కోరనున్నారు. నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల రాకపోకలు నిలిపి వేస్తామన్నారు.

దశలవారీగా ఎక్స్‌ప్లోజివ్స్‌ ద్వారా వీటిని కూల్చివేయనున్నారు. ఈ పేలుడుకు మూడు గంటల ముందు, రెండు గంటల తర్వాత ఐదు గంటల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని నోయిడా అథారిటీ సీనియర్ అధికారి తెలిపారు. దీంతో ట్విన్ టవర్‌లకు ఆనుకుని ఉన్న ఎమరాల్డ్ కోర్ట్ ఏటీఎస్‌ విలేజ్ సొసైటీ నివాసితులపై కూడా ఈ కూల్చివేత తీవ్ర ప్రభావాన్ని చూపనుంది.

మరిన్ని వార్తలు