పన్ను పోటు లేని ప్రదేశం.. క్రిప్టో కుబేరులకు ఇప్పుడది స్వర్గధామం! ఏదంటే..

13 Dec, 2021 14:06 IST|Sakshi

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చట్టాలు చాలా దేశాల్లో కఠినతరంగా అమలు అవుతున్నాయి. ఒకరకంగా చూసుకుంటే అభివృద్ధి చెందిన దేశాల కంటే.. భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే చట్టపు మినహాయింపులతో కొంచెం ఊరట లభిస్తోంది. ఈ తరుణంలో అమెరికా, ఇతర దేశాల నుంచి పన్ను పోటును తప్పించుకునేందుకు ఓ చిన్న కరేబియన్‌ ద్వీపానికి క్యూ కడుతున్నారు క్రిప్టో కుబేరులు. 


ప్యూర్టో రికా.. మూడున్నర వేల చదరపు మైళ్ల విస్తీర్ణం, 32 లక్షలకు పైగా జనాభా ఉన్న చిన్న కరేబియన్‌ టెర్రిటరీ. కార్యనిర్వాహణ, కరెన్సీ మొత్తం వ్యవహారాలన్నీ అమెరికా దేశ పరిధిలోనే నడుస్తోంది.  ఈ దీవిలోని సెయింట్ రెగిస్ బహియా బీచ్ రిసార్ట్ ఇప్పుడు తెర మీద చర్చనీయాంశంగా మారింది.  483 ఎకరాల ప్రకృతి రిజర్వ్‌లో గోల్ఫ్ కోర్స్‌, సముద్ర ముఖ నివాసాలు ఉంటాయి ఈ రిసార్ట్‌లో.  కానీ ఇప్పుడు ఈ ప్రాపర్టీకి హాట్‌ డిమాండ్‌ ఏర్పడింది. పన్ను మినహాయింపులతో కూడిన ఆ రిసార్ట్‌ వెబ్‌సైట్‌ చూసి.. అక్కడికి క్యూ కడుతున్నారు క్రిప్టో కోటీశ్వరులు. 

ఒకరి తర్వాత ఒకరు..

ఐకిగాయ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ ఆంటోనీ ఎమ్ట్‌మ్యాన్‌.. ఈ ఏడాది మార్చ్‌లో లాస్‌​ ఏంజెల్స్‌ను వీడి  ఈ దీవిని కొనుగోలు చేసి సెటిల్‌ అయ్యాడు. క్రిప్టో కమ్యూనిటీ మొత్తం ప్యూర్టో రికా క్యూ కట్టడానికి మూల కారణం ఇతగాడే.  ఇక ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలు చేసిన మాజీ ఉద్యోగిణి, విజిల్‌బ్లోయర్‌ ఫ్రాన్సిస్‌ హ్యూగెన్‌ కూడా.. ప్యూర్టో రికోలో తన క్రిప్టో స్నేహితులతో కలిసి జీవించనున్నట్లు ఈ మధ్యే ప్రకటించారు. మరోవైపు న్యూయార్క్ మేయర్‌-ఎలెక్ట్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ కిందటి నెలలో క్రిప్టో బిలియనీర్‌ బ్రాక్‌ పియర్స్‌తో కలిసి ప్యూర్టో రికా గవర్నర్‌పెడ్రోతో కలిసి ఏకంగా డిన్నర్‌ చేశాడు. ఇలా అమెరికా కుబేరులు.. ప్రత్యేకించి డిజిటల్‌ కరెన్సీతో సంబంధం ఉన్నవాళ్లంతా ఇప్పుడు ఈ దీవి పట్ల ఆసక్తికనబరుస్తున్నారు. 

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నామమాత్రమే!

క్రిప్టో కుబేరులంతా ప్యూర్టో రికాకు క్యూ కట్టడానికి కారణం.. ఇక్కడ పన్ను మినహాయింపులు ఉండడం. అవును కొత్తగా వస్తున్న నివాసితులంతా.. తాము సంపాదించే దాని మీద నామమాత్రపు పన్ను ఇక్కడ చెల్లించాల్సి ఉంటుంది. పైగా క్రిప్టో కరెన్సీ విషయంలో ఆ మినహాయింపు ఇంకా ఎక్కువే ఉంది. అదెందుకో చెప్పే ముందు.. అసలు వాళ్లు అమెరికాను ఎందుకు వీడుతున్నారో చూద్దాం.. అమెరికా ఫెడరల్‌ చట్టాల ప్రకారం..  అమెరికాలో ఇన్వెస్టర్లు 37 శాతం తక్కువ రాబడి వచ్చినా సరే 20 శాతం దాకా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. దీనికితోడు కుబేరుల నుంచి మరింత పన్నులు వసూలు చేయాలంటూ బైడెన్‌ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నారు డెమొక్రట్లు. ఈ ప్రయత్నాలతో పాటు కొత్తగా రాబోతున్న చట్టాలతో మిలీయనీర్లకు, బిలీయనీర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. ఈ క్రమంలోనే తమకు ‘మినిమమ్‌’ ట్యాక్స్‌ వెసులుబాటు అందిస్తున్న కరేబియన్‌ ద్వీపం ప్యూర్టో రికాకు తరలిపోతున్నారు.  

లోకల్‌ కంటే నాన్‌-లోకల్‌కే.. 

ప్యూర్టో రికా చట్టాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఇక్కడి శాశ్వత నివాసితులు ఫెడరల్‌ ట్యాక్సులు కట్టాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల మీద వాళ్లకొచ్చే ఆదాయం ఆధారంగా చెల్లించాల్సి ఉంటుంది. నాన్‌ రెసిడెంట్స్‌కు కూడా ఇదే వర్తిస్తుంది.  అదే అమెరికా, ఇతర దేశాల నుంచి వచ్చే ‘బోనా ఫైడ్‌ రెసిడెన్స్‌’ నామినల్‌ ట్యాక్సుల కింద 4 శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్యూర్టో రికా ట్యాక్స్‌ చట్టం.. స్థానికుల కంటే పొరుగు వాళ్లకే ఎక్కువ లాభం చేకూరుస్తోందన్నమాట. అందుకే ఇప్పుడు ప్రతీ కుబేరుడి చూపు అటువైపు ఉంటోంది. ఇది తట్టుకోలేకే ప్యూర్టో రికా ప్రజలు.. యూఎస్‌ఏలో 51వ దేశంగా ప్యూర్టో రికాను గుర్తించాలని పోరాటాలు చేస్తున్నారు. తద్వారా తమకు దక్కని మినహాయింపులు.. ఇతరులకు దక్కడంపై వినూత్న నిరసన వ్యక్తం చేస్తున్నారు.

మినహాయింపు కారణం..

కరెన్సీ కొరత, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు 2012 లో ప్యూర్టో రికన్‌ ప్రభుత్వం ట్యాక్స్‌ చట్టానికి సవరణ చేసి.. మినహాయింపులు ఇచ్చింది. ఈ కారణంతోనే రియల్‌ ఎస్టేట్‌ ధరలు ఈ నేలపై ఎప్పుడో ఆకాశాన్ని అంటాయి.  నిజానికి 2017లోనే క్రిప్టో కరెన్సీ రన్‌ కొనసాగుతున్నప్పుడు.. ఎంతో మంది ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ, ఆ టైంలో ఆ ఐడియా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. అయితే ఈ ఏడాది క్రిప్టో బూమ్‌ కొనసాగుతుండడంతో ఏకంగా 1,200 అప్లికేషన్లు ‘ఇన్వెస్టర్స్‌ యాక్ట్‌’ ప్రకారం దాఖలు అయ్యాయట. దీంతో క్యాపిటల్‌ గెయిన్‌(సంపాదన) మీద పైసా ట్యాక్స్‌ చెల్లించాల్సిన అవసరం ఉండదు.  ఇక అమెరికా నుంచి వస్తున్న ఈ అప్లికేషన్ల సంఖ్య గతంలో పోలిస్తే మూడు రెట్లు పెరిగిందని రిపోర్టులు చెప్తున్నాయి. 


ఇదే తొలి కాదు.. చివరా కాదు

క్రిప్టో మార్కెట్స్‌ పెరుగుదల, రిమోట్‌ వర్క్‌ కారణంగా చాలా మంది ప్యూర్టో రికాలో సెటిల్‌ అయ్యేందుకు, బిజినెస్‌ లావాదేవీల కోసం క్యూ కడుతున్నారు.  ప్రస్తుతం రిసార్ట్ కమ్యూనిటీలో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ నడుస్తోంది. పంటేరా క్యాపిటల్‌, రెడ్‌వుడ్‌ సిటీ వెంచర్స్‌.. కార్యాలయాలు నెలకొల్పి జోరుగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ప్యూర్టో రికా రాజధాని శాన్‌ జువాన్‌కి 26 మైళ్ల దూరంలోని బహియా, డోరాడో బీచ్‌ రీసార్ట్‌, కొండాడో (శాన్‌ జువాన్లోని సిటీ).. డిమాండ్‌ ఊపందుకుంటోంది. మినీ మియామీగా కొండాడోను అభివర్ణిస్తున్నారు.

ట్యాక్స్‌ బచాయించడానికి ఇక్కడికి చేరుకుంటున్న క్రిప్టో కుబేరులు.. డిసెంబర్‌ 6న ఏకంగా బ్లాక్‌చెయిన్‌ వీక్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఒకరకంగా ‘బ్లాక్‌చెయిన్‌ క్యాపిటల్‌’గా గుర్తింపు దక్కిందని చెప్తున్నారు బిట్‌యాంగిల్స్‌ ఫౌండర్‌ మైకేల్‌ టర్పిన్‌. అయితే ఇలా డిజిటల్‌​ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న ప్రాంతంగా ప్యూర్టో రికా మొదటిదేం కాదు. చివరిది కూడా కాదు. చిన్న దేశం ఎల్‌ సాల్వడర్‌ ఇందులో(బిట్‌ కాయిన్‌కి అధికారికత కట్టబెట్టడం..తయారీ) ఎప్పటి నుంచో ముందంజలో ఉంది. ఇక పోర్చుగల్‌ కూడా క్రిప్టోకరెన్సీ క్రయవిక్రయాల మీద ట్యాక్స్‌లు విధించకుండా(ప్రధాన ఆదాయ వనరు కానంత వరకే).. డిజిటల్‌ మార్కెట్‌ను ఆకట్టుకుంటోంది. 


-సాక్షి, వెబ్‌స్పెషల్‌

మరిన్ని వార్తలు