నార్త్ కొరియా: లెదర్‌ జాకెట్లు బ్యాన్‌.. కిమ్‌కు మాత్రమే మినహాయింపు!

26 Nov, 2021 11:56 IST|Sakshi

బయటి ప్రపంచంలో కనెక్టివిటీ అంతగా ఉండని ఉత్తర కొరియా గురించి రకరకాల కథనాలు బయటకు వస్తుంటాయి. వాటిలో నిజాల సంగతి ఎలా ఉన్నా.. కిమ్‌ పాలనలో కొరియన్‌ పౌరులు గడ్డుపరిస్థితినే ఎదుర్కొంటున్నారనేది మాత్రం వాస్తవం. తాజాగా కిమ్‌ తీసుకున్న ఓ నిర్ణయం అక్కడి లెదర్‌ వ్యాపారులకు, యువతకు అసలు సహించడం లేదు.


ఉత్తర కొరియా దేశవ్యాప్తంగా లెదర్‌ కోట్లు, జాకెట్లను నిషేధిస్తూ కిమ్‌ ప్రభుత్వం బుధవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది. పైగా అధ్యక్షుడు కిమ్‌ తప్ప ఎవరూ వాటిని ధరించడానికి వీల్లేదని ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఇంతకీ ఆఘమేఘాల మీద ఈ ఆదేశాలు ఎందుకు ఇచ్చారో తెలుసా?. ఈ నెల 21న(నవంబర్‌) ప్యాంగ్‌యాంగ్‌ పర్యటన సందర్భంగా కిమ్‌ జోంగ్‌ ఉన్‌ వేసుకున్న లెదర్‌ జాకెట్‌ లాంటిదే.. కొందరు యువకులు అలాంటి జాకెట్లే వేసుకుని కనిపించారు. ఉత్తర కొరియా పౌరులు అలా ప్రవర్తించడం.. దేశ అధ్యక్షుడి ఫ్యాషన్‌ ఛాయిస్‌ను అవమానించినట్లే అవుతుందని పేర్కొంది అక్కడి ప్రభుత్వం. అందుకే లెదర్‌జాకెట్ల నిషేధ ఆదేశాలు ధిక్కరిస్తే ఆరేళ్లు నిర్బంధ కారాగార శిక్ష విధిస్తామని హెచ్చరిస్తోంది కూడా.

 

చైనాకు చెందిన రేడియో ఫ్రీ ఏషియా  కథనం ప్రకారం..  2019లో ఓ కార్యక్రమం సందర్భంగా లెదర్‌ కోట్‌ ధరించి కనిపించాడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌. అప్పటి నుంచి వాటికి ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. అయితే ఒరిజినల్‌ లెదర్‌ ట్రెంచ్‌ కోట్‌ల ధర చాలా ఎక్కువ. దీంతో చైనా నుంచి డూప్లికేట్‌ లెదర్‌ జాకెట్లు ఎక్కువగా ఉత్తర కొరియాకు ఎగుమతి అయ్యాయి. వాటిని కొరియా యువత ఎక్కువగా కొనుగోలు చేస్తూ వస్తోంది. ఒరిజినల్‌ లెదర్‌ కోట్‌ల ధర లక్షా డెబ్భై వేల వన్‌(34 డాలర్లు) కాగా, డూప్లికేట్‌ జాకెట్ల ధర ఎనభై వేల వన్‌(16 డాలర్లు)కు అమ్ముడపోయేవి.   

వన్‌ అంటే నార్త్ కొరియా కరెన్సీ

అయితే తాజా పరిణామంతో లెదర్‌ జాకెట్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. కిమ్‌ జోంగ్‌ ఉన్‌, అతని సోదరి కిమ్‌ యో జోంగ్‌ లాంటి అధికారం నడిపించే వాళ్లకు మాత్రమే అలాంటి జాకెట్‌లు ధరించే అర్హత ఉందని తాజా ప్రభుత్వ ఆదేశాలు పేర్కొన్నాయి. అది వాళ్లకే హుందాతనమని, కానీ డూప్లికేట్‌ జాకెట్‌లతో అధ్యక్షుడిని అనుకరిస్తున్నారని.. కించపరుస్తున్నారని,  ఇది మంచి పద్ధతి కాదని ప్రభుత్వం పేర్కొంది.

 

అంతేకాదు ప్యాషన్‌ పోలీసింగ్‌ పేరుతో ప్యోంగ్‌సాంగ్‌ సిటీలో పోలీసులు పాట్రోలింగ్‌ చేపట్టారు. రోడ్ల మీద జనాల నుంచి అలాంటి జాకెట్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు లెదర్‌ వ్యాపారులకు గట్టి వార్నింగ్‌ ఇస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై అక్కడి యువత నిరసన వ్యక్తం చేస్తోంది. తమ డబ్బుతో కొనుక్కున్న వస్తువులపై ప్రభుత్వ అజమాయిషీ ఏంటని ప్రశ్నిస్తున్నారు వాళ్లు. పైగా  2000 సంవత్సరం నుంచే లెదర్‌ జాకెట్‌ ఫ్యాషన్‌ ట్రెండ్‌ ఉందని, అలాంటప్పుడు ఇప్పుడు ఎలా నిషేధిస్తారని వాదిస్తున్నారు. అయితే కిమ్‌ ఆ జాకెట్‌లో కనిపించిన తర్వాతే.. వాటి అమ్మకాలు పెరిగాయన్నది అక్కడి లెదర్‌ వ్యాపారులు చెప్తున్నమాట. కానీ, తమ పొట్ట కొట్టే కిమ్‌ ప్రభుత్వ ఆదేశాలపై లెదర్‌ వ్యాపారులు నిరసన వ్యక్తం చేయలేకపోతున్నారు. 
 

చైనా నుంచే!
ఇదిలా ఉంటే కరోనాతో కిందటి ఏడాది జనవరి నుంచి చైనా నుంచి నార్త్‌ కొరియాకు సరిహద్దులు మూసుకుపోయాయి. అన్ని రకాల వర్తకవాణిజ్యాలు నిలిచిపోయాయి. ఐరాస, అమెరికా ఆంక్షలతో ఈ ఏప్రిల్‌ నుంచి అక్రమ వర్తకం కూడా ఆగిపోయింది. కానీ, చైనా నుంచి మాత్రం దొంగతనంగా వస్తువులు వెళ్తునే ఉన్నాయి.  తాజా పరిణామాల తర్వాత స్వదేశంలో లెదర్‌ వ్యాపారాలపై కిమ్‌ ప్రభుత్వం ఓ కన్నేసి ఉంచినప్పటికీ..  చైనా నుంచి దొంగతనంగా దిగుమతి అవుతూనే వస్తోంది. నెలకు నాలుగు వేల వన్‌లు సంపాదించే ఉత్తర కొరియన్లు.. అధిక ధరల కారణంగా చైనా నుంచి వచ్చే దొంగ సరుకునే కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో పట్టుబడుతూ కఠిన శిక్షలకు గురవుతున్నారు.

చదవండి: నార్త్‌ కొరియా దీనస్థితి.. కిమ్‌ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు