Notes Ban: నోట్ల రద్దు రాజ్యాంగ బద్ధమేనా? సుప్రీంలో విచారణ 

27 Sep, 2022 17:47 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో 86 శాతం చలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ  2016లో తీసుకున్న సంచలన  నిర్ణయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. నల్లధనం, నకిలీ నోట్ల చలామణికి చెక్‌ పెట్టేందుకంటూ  రాత్రికి రాత్రే ప్రకటించిన ఈ నిషేధం పెను దుమారాన్ని సృష్టించింది.  దాదాపు  ఆరేళ్ల  తర్వాత మళ్లీ ఈ వివాదాస్పద అంశం వార్తల్లో నిలిచింది.

నోట్ల రద్దు రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను రేపు (బుధవారం) సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం  ఈ పిటిషన్లను విచారించనుంది.   దీనికి ఏకంగా నాలుగు రాజ్యాంగ ధర్మాసనాలు అధ్యక్షత వహించనున్నాయి. వివరణాత్మక విచారణ తేదీని బెంచ్ నిర్ణయించే అవకాశం ఉంది. డిసెంబరు 16, 2016న ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించినప్పటికీ ఇంకా బెంచ్‌ను ఏర్పాటు చేయలేదు.

కాగా నవంబర్ 8, 2016న ఆకస్మికంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ అనూహ్యంగాఅదే రోజు అర్ధరాత్రినుండి, అప్పటికి చెలామణిలోఉన్న 500, 1,000 రూపాయల  నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని తీసుకున్న బాధ్యతా రాహిత్యమైన ఈ చర్య దేశ ఆర్థికవ్యవస్థను నాశనం చేసిందని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. అంతేకాదు ఉన్న నోట్లను మార్చకునేందుకు క్యూలైన్లలో సామాన్య ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నగదు కొరత కారణంగా బ్యాంకుల వద్ద పొడవైన లైన్లు వేచి ఉండలేక కొంతమంది క్యూ లైన్లలోనే  ప్రాణాలు కోల్పోయారు. 

మరిన్ని వార్తలు