మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త’..ఈ నెంబర్‌కు మెసేజ్‌ పంపితే చాలు..వాట్సాప్‌కే మెట్రో టికెట్‌..

4 Oct, 2022 14:21 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మెట్రో టికెట్లను ఇకనుంచి వాట్సప్‌ మాధ్యమం ద్వారా కొనుగోలు చేసి జర్నీ చేయొచ్చు. దేశంలోనే తొలిసారిగా పూర్తిస్థాయిలో డిజిటల్‌ చెల్లింపుల విధానాన్ని అమలు చేసేందుకు ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సప్‌ ద్వారా ఈ– టికెట్‌ కొనుగోలు చేసే విధానానికి ఎల్‌అండ్‌టీ మెట్రో సంస్థ శ్రీకారం చుట్టింది.
  
ఇందుకోసం దేశంలోని ప్రముఖ ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫాం బిల్‌ ఈజీ, సింగపూర్‌కు చెందిన షెల్‌ఇన్ఫోగ్లోబల్‌ ఎస్‌సీ సంస్థల సహకారం, భాగస్వామ్యం తీసుకుంది. దీంతో ప్రయాణికులు తమ వాట్సప్‌ నంబరు ద్వారా మెట్రో టికెట్‌ కొనుగోలు చేసే అవకాశం దక్కింది. ఈ– టికెట్‌ను మెట్రో స్టేషన్‌లోకి ప్రవేశించే ముందు ఆటోమేటిక్‌ ఫెయిర్‌ కలెక్షన్‌ గేటు వద్ద చూపి లోనికి ప్రవేశించవచ్చు.

ఈ సందర్భంగా ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. డిజిటలైజేషన్‌ దిశగా నగర మెట్రో అడుగులు వేస్తుందన్నారు. డిజిటల్‌ ఇండియా మిషన్‌కు పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. కాలుష్య రహిత ప్రయాణం, డిజిటల్‌ సాంకేతికతకు మెట్రో పట్టం కడుతోందన్నారు. బిల్‌ఈజీ సంస్థ ఎండీ ఆకాశ్‌ దిలీప్‌ పాటిల్‌ మాట్లాడుతూ..ఎల్‌అండ్‌టీ మెట్రోతో భాగస్వామిగా చేరడం పట్ల హర్షం ప్రకటించారు. 

ఈ– టికెట్‌ కొనుగోలు చేయండిలా.. 

 ముందుగా వినియోగదారులు మెట్రోరైల్‌ నంబరు 8341146468 వాట్సప్‌ నంబరుకు హాయ్‌ అనే సందేశాన్ని పంపించాలి. 

 మీ నంబరుకు ఓటీపీతో పాటు ఈ– టికెట్‌ బుకింగ్‌కు సంబంధించి యూఆర్‌ఎల్‌ లింక్‌ వస్తుంది.  5 నిమిషాల వ్యవధి లభిస్తుంది.  

లింక్‌ను క్లిక్‌ చేస్తే ఈ– టికెట్‌ గేట్‌వే వెబ్‌పేజ్‌ తెరుచుకుంటుంది. 

ఆ తర్వాత మీరు ప్రయాణించే మార్గాన్ని ఎంటర్‌చేసి గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం, రూపే డెమిట్‌ కార్డ్‌ల ద్వారా టిక్కెట్‌ కొనుగోలు చేయవచ్చు.దీంతో మీ వాట్సప్‌కు ఈ– టికెట్‌ యూఆర్‌ఎల్‌ లింక్‌ వస్తుంది. ఈ లింక్‌ను క్లిక్‌ చేస్తే క్యూఆర్‌ ఈ– టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

ఈ క్యూఆర్‌ ఈ–టికెట్‌ను స్టేషన్‌లోకి ప్రవేశించే ముందు ఏఎఫ్‌సీ గేటు వద్ద స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. వాట్సప్‌ టికెట్‌ ఒకరోజు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది.

మరిన్ని వార్తలు