ఇంటివద్దకే మొబైల్‌ సిమ్‌! 

22 Sep, 2021 04:53 IST|Sakshi

డిజిలాకర్‌లో పత్రాలతో ఈ–కేవైసీకి వెసులుబాటు 

డాట్‌ ఆదేశాలు 

న్యూఢిల్లీ: కొత్త మొబైల్‌ కనెక్షన్ల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ టెలికం శాఖ (డాట్‌) ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం కస్టమరు.. ఆన్‌లైన్‌లోనే కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకుని, ఆధార్‌ లేదా డిజిలాకర్‌లో భద్రపర్చిన ఇతరత్రా గుర్తింపు పత్రాలతో ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంటి వద్దే సిమ్‌ కార్డు పొందవచ్చు. కొత్త మొబైల్‌ కనెక్షన్‌ కోసం విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికార సంస్థ యూఐడీఏఐకి సంబంధించిన ఆధార్‌ ఆధారిత ఈ–కేవైసీ సర్వీసులను వినియోగించుకున్నందుకు గాను కస్టమర్లు రూ. 1 చెల్లించాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం టెలికం రంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణల్లో భాగంగా డాట్‌ .. తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొత్త మొబైల్‌ కనెక్షన్‌ తీసుకోవాలన్నా, ప్రీ–పెయిడ్‌ నుంచి పోస్ట్‌–పెయిడ్‌కు లేదా పోస్ట్‌ పెయిడ్‌ నుంచి ప్రీ–పెయిడ్‌ కనెక్షన్‌కు మారాలన్నా కస్టమరు కచ్చితంగా భౌతిక కేవైసీ (కస్టమరు వివరాల వెల్లడి) ప్రక్రియ పాటించాల్సి ఉంటోంది. గుర్తింపు, చిరునామా ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలతో రిటైల్‌ షాపునకు వెళ్లాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌ వినియోగం పెరగడం, కోవిడ్‌–19 కారణంగా కాంటాక్ట్‌రహిత సర్వీసుల అవసరం నెలకొనడం వంటి పరిణామాల నేపథ్యంలో .. కొత్త విధానం సబ్‌స్క్రయిబర్స్‌కు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని డాట్‌ తెలిపింది.   

మరిన్ని వార్తలు