ఆర్థిక నేరాల కట్టడికి ‘ఆధార్‌’ టెక్నాలజీ

25 Nov, 2021 08:44 IST|Sakshi

ఎన్‌పీసీఐ ఎండీ దిలీప్‌ అస్బే ప్రతిపాదన 

న్యూఢిల్లీ: ఆర్థిక నేరాలను గుర్తించేందుకు ఆధార్‌ ఆధారిత టెక్నాలజీలను ఉపయోగించుకోవచ్చని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ఎండీ దిలీప్‌ అస్బే తెలిపారు. రాబోయే మూడు–నాలుగేళ్లలో ఇలాంటి టెక్నాలజీ అందుబాటులోకి రాగలదని ఆధార్‌ 2.0 వర్క్‌షాప్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

ముందే గుర్తించే వీలు
విశిష్ట గుర్తింపు ధృవీకరణ పత్రంగా ఆధార్‌ ఎంతో విలువైనదని, కానీ దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం లేదని దిలీప్‌ అభిప్రాయపడ్డారు.  ‘మన దేశంలో పన్నులు ఎగ్గొట్టడమనేది పెద్ద సమస్యగా ఉంటోంది. ప్రస్తుతం పాన్‌ను, ఆధార్‌ను అనుసంధానించడం వల్ల, ఒక వ్యక్తికి పలు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నా.. అన్నీ కూడా ఆధార్‌కు లింక్‌ అయి ఉంటాయి. అనుమానాస్పద కేసుల్లో ఈ డేటాను మరింత లోతుగా పరిశీలించడం ద్వారా పన్ను ఎగవేత సందర్భాలను కూడా గుర్తించవచ్చు‘ అని దిలీప్‌ చెప్పారు.  ఎవరైనా కస్టమర్‌ ఆర్థిక మోసానికి పాల్పడితే .. పలు సంస్థలపై దాని ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. ‘ఇలాంటి మోసాలను ఎవ్వరూ ఆపలేకపోవచ్చు. అయితే, ఆధార్‌లాంటి విశిష్టమైన పత్రంతో మోసాలకు సంబంధించిన ఒక రిపాజిటరీని తయారు చేయొచ్చు. ఒక వ్యక్తి మోసం చేస్తే వారికి సిమ్‌ కార్డ్‌ మొదలుకుని బ్యాంక్‌ ఖాతా, వాలెట్‌ లాంటివి ఏవీ మళ్లీ లభించకుండా చేయొచ్చు. ఈ విధంగా మోసగాళ్లను ఆదిలోనే గుర్తించి, వారికి అడ్డుకట్ట వేయొచ్చు’ అని అన్నారు.

చదవండి:‘ఆధార్‌పై ఆంక్షలు పెడితే.. అసలుకే ఎసరు’

మరిన్ని వార్తలు