అందుబాటు గృహాలపై ఎన్నారైల ఆసక్తి 

6 Feb, 2021 16:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశీయ రియల్టీ మార్కెట్‌లో ప్రవాస భారతీయులు చాలా ముఖ్యమైనవాళ్లు. వాణిజ్య, నివాస సముదాయాల వృద్ధిలో ఎన్నారైలే కీలకం. మరీ ప్రత్యేకించి అఫర్డబుల్‌ గృహాల విభాగంలో పెట్టుబడులకు ఎన్నారైలు విపరీతమైన ఆసక్తిలో ఉన్నారని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ చైర్మన్‌ అనూజ్‌ పూరీ తెలిపారు. ‘బడా నిర్మాణ సంస్థలు, బ్రాండ్‌ డెవలపర్లు అఫర్డబుల్‌ హౌసింగ్‌ ప్రాజెక్ట్‌లను చేపడుతుండటం ఎన్నారైల విశ్వసనీయ పెట్టుబడులకు హామీలను అందిస్తున్నాయి. మరోవైపు లగ్జరీ, ఇతరత్రా గృహాల అద్దెల కంటే అఫర్డబుల్‌ ఇళ్ల రెంట్స్‌ మెరుగ్గా ఉండటం, దీర్ఘకాలం పాటు అందుబాటులో ఉండటం ఎన్నారైలకు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయని’ ఆయన వివరించారు. 

అఫర్డబుల్‌ హౌసింగ్‌ ప్రాజెక్ట్‌లకు ఏడాది పాటు ట్యాక్స్‌ హాలిడే పొడిగింపుతో ఎన్నారైలతో పాటు దేశీయ కొనుగోలుదారులకు సరసమైన గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులకు ఆసక్తి పెరుగుతుంది. మరోవైపు కొత్త ప్రాజెక్ట్‌ల ధరలు కూడా అదుపులో ఉంటాయి. ప్రస్తుతం దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో కొత్త గృహాల సప్లయిలో 35 శాతం అఫర్డబుల్‌ హౌసింగ్సే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఎన్నారైల రియల్టీ పెట్టుబడులు చాలావరకు క్షీణించాయి. చాలా దేశాల్లో పరిస్థితులు క్రమంగా మెరుగవుతుండటం అఫర్డబుల్‌ రియలీ్టకి కలిసొచ్చే అంశం.

చదవండి:

సొంతిల్లు కొనేందుకు వయసూ ముఖ్యమే! 

బెంగళూరు కంటే హైదరాబాదే చాలా కాస్లీ

మరిన్ని వార్తలు