రీట్స్, ఇన్విట్స్‌ ఇండెక్స్‌ షురూ

12 Apr, 2023 04:37 IST|Sakshi

న్యూఢిల్లీ: స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ.. దేశీయంగా తొలిసారి రియల్‌ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌(రీట్స్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌(ఇన్విట్‌) ఇండెక్స్‌ను ప్రవేశపెట్టింది. తద్వారా స్టాక్‌ ఎక్సే్ఛంజీలో లిస్టయ్యి, ట్రేడయ్యే రీట్స్, ఇన్విట్స్‌ పనితీరును పరిశీలించేందుకు మదుపరులకు వీలు చిక్కనున్నట్లు ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది. ఆదాయాన్ని ఆర్జించే రియల్టీ ఆస్తులతో రీట్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆస్తులతో ఇన్విట్స్‌ ఏర్పాటయ్యే సంగతి తెలిసిందే. వీటి ద్వారా ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్‌ చేసేందుకు వీలుంటుంది.

దీర్ఘకాలికమైన రియల్టీ ప్రాజెక్టులలో రీట్స్, మౌలిక రంగ ప్రాజెక్టులలో ఇన్విట్స్‌ పెట్టుబడులు చేపడుతుంటాయి. వీటి ద్వారా ఇన్వెస్టర్లకు విభిన్న మార్గాలలో నిరవధిక ఆదాయానికి అవకాశం ఏర్పడుతుంది. మరోవైపు నగదు ఆర్జించే ప్రాజెక్టుల ద్వారా నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ ఆర్థిక అవకాశాలుగా రీట్స్, ఇన్విట్స్‌ గుర్తింపు పొందాయి. కాగా.. ఇండెక్సులో ఫ్రీఫ్లోట్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఆధారంగా సెక్యూరిటీలకు వెయిటేజీ ఇవ్వనున్నట్లు ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది. ఒక్కో సెక్యూరిటీకి 33 శాతం పరిమితిని అమలు చేయనుంది. ఇండెక్స్‌ ప్రాథమిక విలువ 1,000కాగా.. త్రైమాసికవారీగా సమీక్షించనుంది.

మరిన్ని వార్తలు