నిఫ్టీ సూచీ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ తొలగింపు!

21 Oct, 2022 06:34 IST|Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో విలీనానికి ముందే

ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తి కావచ్చని అంచనా. విలీనానికి రికార్డ్‌ తేదీ ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాది డిసెంబర్‌ లేదంటే వచ్చే జనవరిలో ఇది ఉండొచ్చు. ఈ రికార్డ్‌ తేదీకి ముందే నిఫ్టీ–50 సూచీ నుంచి హెచ్‌డీఎఫ్‌సీని ఎన్‌ఎస్‌ఈ తొలగించొచ్చని తెలుస్తోంది. ఈ విలీనం దేశంలోనే పెద్దదిగా నిలవనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీ విలీనానికి దాదాపు అన్ని రకాల అనుమతులు లభించాయి. ఇంకా కంపెనీ వాటాదారులు ఆమోదం తెలపాల్సి ఉంది. వాటాదారుల సమావేశం నవంబర్‌ 25న నిర్వహించనున్నారు.

అలాగే, ఆర్‌బీఐ నుంచి తుది ఆమోదం కూడా రావాల్సి ఉంది. హెచ్‌డీఎఫ్‌సీకి నిఫ్టీ ఇండెక్స్‌లో 5.5 శాతం వెయిటేజీ ఉంది. దీంతో 1.3–1.5 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు హెచ్‌డీఎఫ్‌సీ నుంచి వెళ్లిపోవచ్చని అంచనా. దీంతో నిఫ్టీ సూచీలో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. విలీనానంతరం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు నిఫ్టీ ఇండెక్స్‌లో 13 శాతం వెయిటేజీ రానుంది. ఇది పెద్ద మొత్తం కావడంతో ఇండెక్స్‌పై పడే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్‌ఎస్‌ఈ దీనిపై ఓ చర్చా పత్రం విడుదల చేసింది. దీనిపై నవంబర్‌ 2 నాటికి అభిప్రాయాలు తెలియజేయాలని మార్కెట్‌ భాగస్వాములను కోరింది. విలీనం నేపథ్యంలో స్టాక్‌ ధరలు తీవ్ర అస్థిరతలకు గురి కాకుండా చూడడమే ఎన్‌ఎస్‌ఈ ఉద్దేశ్యం. 

మరిన్ని వార్తలు