ఎన్‌టీపీసీ లాభం క్షీణత, క్యూ2లో రూ. 3,418 కోట్లకు పరిమితం

31 Oct, 2022 08:51 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో విద్యుత్‌ రంగ ప్రభుత్వ దిగ్గజం ఎన్‌టీపీసీ లిమిటెడ్‌ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 3,418 కోట్లకు పరిమితమైంది. 

గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 3,691 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 33,096 కోట్ల నుంచి రూ. 44,681 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 28,950 కోట్ల నుంచి రూ. 40,001 కోట్లకు పెరిగాయి. దిగుమతి చేసుకున్న బొగ్గు సరఫరా 0.42 ఎంఎంటీ నుంచి 5.58 ఎంఎంటీకి జంప్‌ చేసింది. దేశీయంగా బొగ్గు సరఫరా 44.83 ఎంఎంటీ నుంచి 48.72 ఎంఎంటీకి పుంజుకుంది. 

సొంత వినియోగ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి 2.79 ఎంఎంటీ నుంచి 4.32 ఎంఎంటీకి పెరిగింది. సెప్టెంబర్‌ చివరికల్లా విద్యుదుత్పత్తి సామర్థ్యం భాగస్వామ్యం, అనుబంధ సంస్థలతో కలిపి 70,254 మెగావాట్లకు చేరింది. స్థూల విద్యుదుత్పత్తి 77.42 బిలియన్‌ యూనిట్ల నుంచి 85.48 బీయూకి మెరుగుపడింది. 

మరిన్ని వార్తలు