Nykaa దూకుడు: కళ్లు చెదిరేలా లాభం, ఏకంగా 330 శాతం జూమ్‌

2 Nov, 2022 10:15 IST|Sakshi

క్యూ2లో రూ. 5.2 కోట్లు  లాభం

న్యూఢిల్లీ: బ్యూటీ, ఫ్యాషన్‌ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఈకామర్స్‌ వెంచర్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జులై-సెప్టెంబర్‌(క్యూ2)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 5.2 కోట్లను తాకింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 330శాతం ఎక్కువ కావడం విశేషం.

నైకా బ్రాండు కంపెనీ గతేడాది(2021-22) ఇదే కాలంలో కేవలం రూ. 1.2 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 39 శాతం ఎగసి రూ. 1,231 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 885 కోట్ల టర్నోవర్‌ మాత్రమే సాధించింది. ఈ కాలంలో స్థూల వ్యాపార విలువ(జీఎంవీ) 45 శాతం జంప్‌చేసి రూ. 2,346 కోట్లను తాకింది.  ఫలితాల నేపథ్యంలో నైకా షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.4 శాతం బలపడి రూ. 1,180 వద్ద ముగిసింది. అయితే బుధవారం మాత్రం లాభాలను కోల్పోయి స్వల్ప నష్టాలతో కొనసాగుతోంది. 
 

మరిన్ని వార్తలు