ఎలక్ట్రిక్​ వాహనాలపై భారీగా సబ్సిడీలు ఇస్తున్న ఒరిస్సా

31 Oct, 2021 17:58 IST|Sakshi

ఎలక్ట్రిక్ వాహనాల కొనేవారి సంఖ్య  రోజు రోజుకి పెరుగుతున్నట్లు కొన్ని సర్వే సంస్థలు పేర్కొంటున్నాయి. చమురు ధరలు ఆకాశాన్ని తాకడమే ఇందుకు కారణం అని తెలుస్తుంది. దీంతో ఈవీ తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ తో ముందుకు వస్తున్నాయి. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారీగా సబ్సిడీలు ఇస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ ఇస్తున్న రాష్ట్రాల జాబితాలో తాజాగా ఒరిస్సా రాష్ట్రం వచ్చి చేరింది.

ఎలక్ట్రిక్ వాహనాలపై విధించే మోటారు వాహనం(ఎంవీ)పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులను పూర్తిగా మినహాయిస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం అక్టోబర్ 30న ప్రకటించింది. కాలుష్యాన్ని అరికట్టడం కోసం, ఎలక్ట్రిక్ వాహనాలను కొనేవారిని ప్రోత్సహించడం కోసం ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. బ్యాటరీతో నడిచే అన్ని రకాల వాహనాలపై మోటారు వాహన పన్నులు, రిజిస్ట్రేషన్ ఫీజులను 100 శాతం మినహాయింపును ఇస్తున్నట్లు ఒరిస్సా రాష్ట్ర వాణిజ్య, రవాణా శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
 

"ఒరిస్సా మోటారు వాహనాల పన్నుల చట్టం, 1975లోని సెక్షన్ 15 సబ్ సెక్షన్(1) క్లాజ్(1) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈవీలకు మోటారు వాహన పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులపై 100% మినహాయింపును ఇస్తున్నట్లు ప్రకటించింది" అని ఒరిస్సా వాణిజ్య రవాణా శాఖ ట్వీట్ పేర్కొంది. ఈ మినహాయింపు డిసెంబర్ 31, 2025 వరకు వర్తిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం ఒడిశా ఎలక్ట్రిక్ వాహన విధానం 2021ను సెప్టెంబర్ 2న ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారులను ప్రోత్సహించే లక్ష్యంతో నీతి ఆయోగ్ సలహాతో ఒరిస్సా ఈవీ విధానాన్ని రూపొందించింది.

వినియోగదారులు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు, బ్యాటరీలు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల డెవలపర్లకు సబ్సిడీ అందించాలని ఈ విధానంలో ప్రతిపాదించింది. ఐదేళ్లపాటు అమల్లోకి వచ్చే ఒడిశా ఈవీ విధానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు ఈవీ బేస్ ధరపై 15 శాతం సబ్సిడీని అందించనుంది. ఎలక్ట్రిక్ టూ వీలర్ వినియోగదారులు గరిష్టంగా ₹5,000కి సబ్సిడీ అందుకోనుండగా, ఎలక్ట్రిక్ త్రీ & ఫోర్ వీలర్ వినియోగదారులు వరుసగా ₹10,000, ₹50,000 ప్రోత్సాహకాలను అందుకొనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఫేమ్-2 పథకం కింద వినియోగదారులకు లభించే ప్రయోజనాలకు మించి ఈ ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. 

మరిన్ని వార్తలు