ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ తగ్గింది

31 Mar, 2023 03:44 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి–మార్చిలో ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీస్‌ స్పేస్‌ నికర లీజింగ్‌ 76.3 లక్షల చదరపు అడుగులు నమోదైంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 34 శాతం తగ్గుదల అని రియల్టీ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ ఇండియా నివేదిక తెలిపింది. ‘2023 జనవరి–మార్చిలో నికర లీజింగ్‌ ఆరు త్రైమాసికాల్లో కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, కొనసాగుతున్న హైబ్రిడ్‌ పని విధానం కారణంగా కార్పొరేట్‌ కంపెనీలు విస్తరణపై ఆచితూచి వ్యవహరించడమే ఇందుకు కారణం. రియల్‌ ఎస్టేట్‌ ఖర్చులకు తగ్గించుకోవడానికి కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి.

నికర లీజింగ్‌ చెన్నై 50 శాతం పడిపోయి 6 లక్షల చదరపు అడుగులు, హైదరాబాద్‌ 85 శాతం తగ్గి 5.2 లక్షలు, ముంబై 39% క్షీణించి 8.8 లక్షలు, పుణే 44% తగ్గి 12.8 లక్షల చదరపు అడుగులుగా ఉంది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ 47% దూసుకెళ్లి 19.6 లక్షల చదరపు అడుగులు, బెంగళూరు 14% పెరిగి 19.1 లక్షలు, కోల్‌కతా రెండింతలై 4.6 లక్షల చదరపు అడుగుల నికర లీజింగ్‌ నమోదైంది. ఈ నగరాల్లో నికర లీజింగ్‌ 2022 జనవరి–మార్చిలో 1.15 కోట్ల చదరపు అడుగులు ఉంది. సాంకేతిక పరిశ్రమలో మందగమనం ఉన్నప్పటికీ ఆఫీస్‌ స్పేస్‌ కోసం డిమాండ్‌ స్థిరంగా ఉంటుంది. 2022 మాదిరిగా ఈ ఏడాది 3.6–4 కోట్ల చదరపు అడుగులు అంచనా వేస్తున్నాం. మరో త్రైమాసికం తర్వాత ఆఫీస్‌ డిమాండ్‌ ఎలా ఉంటుందనే అంశంలో స్పష్టత వస్తుంది’ అని జేఎల్‌ఎల్‌ వివరించింది.

మరిన్ని వార్తలు