ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ పెరిగింది

21 Feb, 2023 04:15 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 2023 జనవరిలో ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ 32 లక్షల చదరపు అడుగులు నమోదైంది. 2022 జనవరితో పోలిస్తే ఇది 93 శాతం అధికం అని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ ఇండియా నివేదిక తెలిపింది. ‘హైదరాబాద్‌సహా ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణే, కోల్‌కతలో 2022 డిసెంబర్‌తో పోలిస్తే గత నెలలో ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ 56 శాతం తగ్గింది. గ్లోబల్‌ కార్పొరేట్లకు సెలవు కాలం కాబట్టి జనవరి నెల సాధారణంగా నెమ్మదిగా ఉంటుంది. ఐటీ రంగంలో నియామకాలు నెమ్మదించాయి.

వృద్ధి అంచనాలూ మందకొడిగా ఉన్నాయి. దీంతో ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ విషయంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అయినప్పటికీ జనవరి నెల ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌లో ఐటీ, ఐటీఈఎస్‌ విభాగం అత్యధికంగా 28 శాతం వాటా కైవసం చేసుకుంది. జనవరిలో ఢిల్లీ ఎన్‌సీఆర్, చెన్నై, ముంబై టాప్‌–3లో నిలిచాయి. ఈ మూడు నగరాల వాటా 77 శాతం’ అని జేఎల్‌ఎల్‌ వివరించింది. 2022 మార్చి నాటికి ప్రీమియం గ్రేడ్‌ ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ 73.2 కోట్ల చదరపు అడుగులుగా ఉంది. అలాగే ఇతర గ్రేడ్స్‌లో ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ 37 కోట్ల చదరపు అడుగులు నమోదైంది.

మరిన్ని వార్తలు