రష్యన్‌లకు ఇండియన్‌ కిక్కు.. అక్కడ మన ‘ఆఫీసర్స్‌ ఛాయిస్‌’!

3 Mar, 2023 18:19 IST|Sakshi

ఇండియన్‌ మద్యం కంపెనీ రష్యన్‌ మార్కెట్‌లోకి ప్రవేశించబోతోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన విస్కీల్లో మూడోదైన ఆఫీసర్‌ ఛాయిస్‌ను తయారు చేసే అలైడ్ బ్లెండర్స్ అండ్‌ డిస్టిల్లర్స్ (ఏబీడీ) రష్యన్‌ మార్కెట్‌లోకి ప్రవేశించబోతోందని వ్యాపార దినపత్రిక కొమ్మర్‌సంట్ పేర్కొంది. 

రష్యన్ వోడ్కా తయారీ కంపెనీ ఆల్కహాల్ సైబీరియన్ గ్రూప్ (ఏఎస్‌జీ) తమ రెండు ఏబీడీ బ్రాండ్‌లకు పంపిణీదారుగా మాత్రమే ఉంటుందని అలైడ్ బ్లెండర్స్ అండ్‌ డిస్టిల్లర్స్ ప్రకటించింది. ఏబీడీ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు మద్యం ఎగుమతి చేస్తోంది. 2021 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ ఆదాయం 765 మిలియన్‌ డాలర్లు దాటింది.

కొమ్మర్‌సంట్ కథనం ప్రకారం... ప్రస్తుతం రష్యాలో కొన్ని వెస్ట్రన్‌ బ్రాండ్‌లు నిష్క్రమించిన తర్వాత ఖాళీగా ఉన్న మార్కెట్ వాటాను అందుకోవాలని ఏబీడీ కంపెనీ చూస్తోంది. రష్యాలో ఏబీడీ ఉత్పత్తుల డెలివరీలు ఫిబ్రవరిలోనే ప్రారంభమైనప్పటికీ అమ్మకాల పరిమాణం ఏ మేరకు ఉందన్నది ఇంకా తెలియదు. కంపెనీ ఒప్పందం అక్టోబర్ 2025 వరకు ఉంటుందని తెలిసింది.

రష్యాలో ఆఫీసర్స్ ఛాయిస్ బ్లూ విస్కీ 750 ఎంల్‌ బాటిల్‌ ధర 1,000 నుంచి 1,200 రూబిల్స్‌ (రూ.1100 నుంచి రూ.1300) ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే స్టెర్లింగ్ రిజర్వ్ ధర 1,100 నుంచి 1,500 రూబిల్స్‌ ( రూ.1200 నుంచి రూ.1600) ఉంటుంది.

చదవండి: అప్పట్లో వారి కోసం మా జీతాలు భారీగా తగ్గించుకున్నాం: ఇన్ఫీ నారాయణమూర్తి

మరిన్ని వార్తలు