రండి.. ఆయిల్, గ్యాస్‌ ఉత్పత్తిపై పెట్టుబడులు పెట్టండి

31 Jul, 2021 12:04 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో చమురు, సహజ వాయువు ఉత్పత్తి పెంపుపై పెట్టుబడులు పెట్టాలంటూ దేశ, విదేశీ కంపెనీలను పెట్రోలియం మంత్రి హర్‌దీప్‌ సింగ్‌పురి ఆహ్వానించారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న ఏ సమస్యను అయినా పరిష్కరించేందుకు స్వేచ్ఛాయుత విధానాన్ని అనుసరిస్తామని చెప్పారు. ఇన్వెస్టర్లతో నిర్వహించిన సంప్రదింపుల కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ పిలుపునిచ్చారు.

‘‘ఈ రంగానికి సంబంధించి తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యల గుర్తింపు విషయంలో, సవాళ్లను అధిగమించే విషయంలో మీతో కలసి ప్రభుత్వం పనిచేస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధిని సాధించే దిశగా నడుస్తోంది. దీంతో ఇంధనానికి డిమాండ్‌ కూడా పెరగనుంది. దీన్ని చేరుకునేందుకు దేశీయంగా అన్వేషణ, ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో దేశ, విదేశీ కంపెనీలు  భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం.

ప్రపంచంలో ఇంధనంపై పెట్టుబడులకు మంచి అవకాశం ఎక్కడ ఉందా? అని ఎవరైనా ఆలోచిస్తుంటే.. అందుకు భారత్‌ అనుకూలమైనది’’ అని మంత్రి ప్రకటించారు. గతంతో పోలిస్తే భారత్‌లో వ్యాపార నిర్వహణ సులభతరం అయినట్టు చెప్పారు. మూడో దశలో భాగంగా 32 చమురు, గ్యాస్‌ బ్లాక్‌లను వేలం వేసినట్టు పేర్కొన్నారు.    

మరిన్ని వార్తలు