చమురు కంపెనీలకు భారీ షాక్‌!, బాబోయ్‌..ఈ నష్టాలు భరించలేం

3 Dec, 2022 06:58 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్‌ కంపెనీలు (హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ) ఎనిమిది నెలల నుంచి విక్రయ ధరలు సవరించకపోవడంతో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయని, వాటిని సర్దుబాటు చేయాలంటూ ఆర్థిక శాఖను పెట్రోలియం శాఖ కోరనుందని తెలుస్తోంది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఆరు నెలల కాలంలో ఈ మూడు కంపెనీలు రూ.21,201 కోట్ల నష్టాలను ప్రకటించడం గమనార్హం. గత కొన్ని సంవత్సరాలకు సంబంధించి ఎల్‌పీజీ సబ్సిడీ రూ.22,000 కోట్లు కూడా వాటికి రావాల్సి ఉంది. విక్రయ ధరలు పెంచకపోవడం వల్ల అప్పటికే పెరిగిపోయిన ద్రవ్యోల్బణం దృష్ట్యా, ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగినట్టు ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. ఈ దృష్ట్యా వాటికి పరిహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు.

‘‘పెట్రోల్, డీజిల్‌ ధరలను నియంత్రణల పరిధి నుంచి తొలగించారు. కనుక ఓఎంసీలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా రోజువారీ రేట్లను నిర్ణయించొచ్చు. కానీ, అవి తమ ఇష్టానుసారం అవే రేట్లను కొనసాగించాయి’’అని వివరించారు. 

కనుక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ధరల పెంచకపోవడం వల్ల పడే భారంపై అంచనాకు వచ్చిన, ఆ తర్వాత ఆర్థిక శాఖను సంప్రదించొచ్చని చెప్పారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గతంతో పోలిస్తే కొంత దిగొచ్చినప్పటికీ, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇప్పటికీ నష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 6 నుంచి అవి రేట్ల సవరణను నిలిపివేశాయి.

మరిన్ని వార్తలు