కంపెనీలకు చమురు సెగ

9 Mar, 2021 04:56 IST|Sakshi

14 నెలల గరిష్టానికి క్రూడ్‌ ధరలు...

పెయింట్స్, టైర్ల తయారీలో కీలక ముడి వస్తువు ఇదే...

ప్లాస్టిక్స్, కెమికల్స్, రిఫైనరీ కంపెనీలకూ దెబ్బ

ముడి చమురు ఉత్పాదక సంస్థలకు మాత్రం లాభాలు

కోవిడ్‌–19 సృష్టించిన విలయం నుంచి నెమ్మదిగా బయటపడుతున్న ప్రపంచ దేశాలు ఆర్థిక రికవరీ బాటలో సాగుతున్నాయి. దీంతో ఇటీవల బాండ్ల ఈల్డ్స్, డాలరు ఇండెక్స్‌ పుంజుకుంటోంది. మరోవైపు ముడిచమురు ధరలు సైతం బలపడుతున్నాయి. ఫలితంగా చమురు ఉత్పత్తి దేశాలు, కంపెనీలు లాభపడనుండగా.. దేశీయంగా పలు రంగాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. వెరసి వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22)లో పలు రంగాల కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పడవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం..

ముంబై: కొద్ది రోజులుగా ముడిచమురు ధరలు మండుతున్నాయి. తాజాగా విదేశీ మార్కెట్లో 14 నెలల గరిష్టానికి చేరాయి. న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ చమురు, లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ బ్యారల్‌ ధరలు పెరగడంతో ఇండియన్‌ క్రూడ్‌ బాస్కెట్‌ ధరలు సైతం వేడిని పుట్టించనున్నాయి. నైమెక్స్‌ బ్యారల్‌ దాదాపు 66 డాలర్లకు చేరగా.. బ్రెంట్‌ 69 డాలర్లను అధిగమించింది. దీంతో దేశీయంగా పలు రంగాలపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రతికూల ప్రభావం పడనుంది. అయితే చమురును ఉత్పత్తి చేయగల అప్‌స్ట్రీమ్‌ కంపెనీలు ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా, కెయిర్న్, ఆర్‌ఐఎల్‌ లబ్ధి పొందే వీలుంది. అంతర్జాతీయ మార్కెట్ల ధరల ఆధారంగా ముడిచమురును విక్రయించేందుకు వీలుండటమే దీనికి కారణంకాగా.. చమురు శుద్ధి(రిఫైనింగ్‌) కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పడనుంది. ఇదేవిధంగా ముడిచమురు నుంచి లభించే పలు డెరివేటివ్స్‌ ధరలు పెరగడంతో పెయింట్లు, ప్లాస్టిక్, ప్యాకేజింగ్‌ మెటీరియల్స్, కెమికల్స్‌ తదితర రంగాల లాభదాయకతను దెబ్బతీసే వీలుంది.

చమురు జోరు
ప్రపంచ ఆర్థిక రికవరీ, ఉత్పత్తిలో కోతల ఎత్తివేత తదితర అంచనాలతో ఈ ఏడాది రెండు నెలల్లోనే బ్రెంట్‌ చమురు 30 శాతం జంప్‌చేసింది. అయితే గత మూడేళ్లుగా స్తబ్దుగా ఉన్న చమురు ధరలతో దేశీయంగా లబ్ధి పొందుతూ వచ్చిన పలు రంగాలు దీంతో మార్జిన్ల సవాళ్లను ఎదుర్కొనే అవకాశముంది. చమురు డెరివేటివ్స్‌ను పెయింట్స్, టైర్ల తయారీలో కీలక ముడిసరుకుగా వినియోగించే సంగతి తెలిసిందే. పెయింట్స్, టైర్ల తయారీ ముడివ్యయాలలో 40–60 శాతం వాటాను ఇవి ఆక్రమిస్తుంటాయి. ఈ బాటలో ఎఫ్‌ఎంసీజీ, కెమికల్స్, సిమెంట్‌ తదితర రంగాలలోనూ చమురు డెరివేటివ్స్‌ కీలకపాత్ర పోషిస్తుంటాయి. చమురు ధరలు మండితే.. ఏటీఎఫ్‌ ధరలకు రెక్కలొస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఫలితంగా విమానయాన రంగంపై భారీగా భారం పడుతుంది. వెరసి ఎయిర్‌లైన్స్‌ కంపెనీలకు ఆర్థిక సవాళ్లు ఎదురయ్యే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి.

 

మరిన్ని వార్తలు