ఎలక్ట్రిక్‌ వెహికల్‌ వాహనదారులకు ముఖ్య గమనిక!

3 May, 2023 20:06 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ వాహనదారులకు ముఖ్య గమనిక. ఇప్పటికే ఈవీ వెహికల్‌ను కొనుగోలు చేశారా? అదనంగా ఛార‍్జర్లతో పాటు వెహికల్‌కు సంబంధించిన ఎక్విప్‌మెంట్‌ కోసం డబ్బులు ఖర్చు చేశారా? అయితే మీకో శుభవార్త. దేశంలో ఆటోమొబైల్‌ దిగ్గజ సంస్థలైన ఎథేర్‌ ఎనర్జీ, టీవీఎస్‌ మోటార్స్‌, ఓలా, హీరో మోటో కార్ప్‌ కంపెనీలు డబ్బుల్ని రిఫండ్‌ చేస్తున్నట్లు ప్రకటించాయి. 

ద్విచక్ర వాహనం తయారు చేసే సంస్థలకు ఫేమ్‌ పథకం కింద కేంద్రం కొన్ని రాయితీలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. వాహన తయారీ సంస్థలు వాహనదారులకు విక్రయించే వెహికల్‌ ధర రూ.1.5 లక్షలు మించకూడదు. ధర మించితే ఫేమ్‌ పథకం సదరు తయారీ సంస్థలకు వర్తించదు. 

అయినప్పటికీ దేశంలోని కొన్ని ఆటోమొబైల్‌ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించి ఛార్జర్లు, వాహనానికి వినియోగించే ఇతర వస్తువులకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కేంద్రం రాయితీ కింద చెల్లించాల్సిన రూ.800 కోట్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఆయా ఆటోమొబైల్‌ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

తాజాగా కేంద్రం నిర్ణయంతో ఓలా ఎలక్ట్రిక్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలిందంటూ నివేదికలు పేర్కొన్నాయి. 2021 నుంచి ఓలా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రో విక్రయాలు జరిపే సమయంలో హోం ఛార్జర్లకు అదనంగా డబ్బులు వసూలు చేసింది. ఆ మొత్తం విలువ రూ.131 కోట్లుగా ఉంది. తాజాగా కేంద్రం నిర్ణయంతో ఆ భారీ మొత్తాన్ని ఓలా తన వాహన దారులకు చెల్లించాల్సి ఉందని సమాచారం. రీఫండ్‌పై ఓలా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అటు ఏథర్ ఎనర్జీ, టీవీఎస్ మోటార్, హీరో మోటోకార్ప్ సైతం స్పందించలేదు. 

చదవండి👉 ‘ఎలివేట్‌’ పేరిట హోండా కొత్త కారు.. మూడేళ్ల నుంచి ఊరిస్తూ.. చివరికి ఇలా

మరిన్ని వార్తలు