ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ ఎప్పుడో తెలుసా?

8 Nov, 2021 20:15 IST|Sakshi

ఓలా చీఫ్, సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ తేదీలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను పంచుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై నిపుణులు విన్యాసాలు చేస్తున్న వీడియోను భవిష్ ఒక ట్విట్టర్ పోస్ట్ లో పంచుకున్నారు. మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్లో వీడియోను షేర్ చేస్తూ ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ ఇలా రాశారు.. "స్కూటర్‌తో సరదాగా!, టెస్ట్ రైడ్ రాబోయే వారంలో ప్రారంభమవుతాయి. ఆ తర్వాత మొదటి డెలివరీలు కూడా ప్రారంభమవుతాయి" అని అన్నారు. ఈ స్కూటర్ మొదటి డెలివరీ ప్రారంభం ఎప్పటి నుంచి అనేది స్పష్టంగా పేర్కొనలేదు. 

నవంబర్ 10 నుంచి టెస్ట్ రైడ్
ఇంతకు ముందు పోస్టులో నవంబర్ 10 నుంచి ఓలా స్కూటర్లు టెస్ట్ రైడ్ కోసం అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ 1 అమ్మకపు ప్రక్రియను సెప్టెంబర్ నెలలో ప్రారంభించింది. ఓలా ఎస్1, ఎస్1ప్రొ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. కంపెనీ ఆగస్టు 15న తన ఓలా ఎస్1, ఎస్ 1ప్రో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను వరుసగా రూ.99,999, రూ.1,29,999కు లాంచ్ చేసింది. ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రీ లాంచ్ బుకింగ్ లను జూలైలో ₹499కు ప్రారంభించింది. అప్పుడు కేవలం 24 గంటల్లో లక్ష ఆర్డర్లను అందుకుంది. 

అయితే, ఇప్పటివరకు ఎన్ని ఆర్డర్లు వచ్చాయని కంపెనీ వెల్లడించలేదు. ఓలా తమిళనాడులో 500 ఎకరాల్లో తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రారంభంలో 10 లక్షల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభమై, మొదటి దశలో మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా 20 లక్షల వరకు స్కేల్ చేస్తామని కంపెనీ పేర్కొంది. కంపెనీ పూర్తిగా పూర్తయినప్పుడు ఓలా ఎలక్ట్రిక్ తన ప్లాంట్ వార్షిక సామర్థ్యం కోటి యూనిట్లను కలిగి ఉంటుందని పేర్కొంది. ఇది ప్రపంచంలోని మొత్తం ద్విచక్ర వాహనాల ఉత్పత్తిలో 15 శాతం.

మరిన్ని వార్తలు