ప్రీ బుకింగ్స్‌లో దుమ్మురేపిన ఓలా...!

17 Jul, 2021 20:11 IST|Sakshi

ముంబై: రోజురోజు పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంధన ధరలతో సతమతమవుతున్న ప్రజలు ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టిపెట్టారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉత్పత్తి చేయడానికి ఇప్పటికే పలు కంపెనీలు రంగంలోకి దిగాయి. తాజాగా కమ్యూటబుల్‌ కంపెనీ ఓలా నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉత్పతి చేస్తోందన్న విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఓలా ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రీ బుకింగ్స్‌ను రూ. 499కి తన కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభించింది.

బుకింగ్స్‌ ఓపెన్‌ కాగానే. ఓలా ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం ప్రజలు ఎగబడ్డారు. ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం విపరీతంగా డిమాండ్‌ పెరగడంతో కంపెనీ వెబ్‌సైట్‌ బ్లాక్‌ అయ్యింది. ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ప్రీ బుకింగ్స్‌లో భాగంగా ప్రజలనుంచి అనూహ్య స్పందన వచ్చింది. 24 గంటల్లో ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు లక్షకు పైగా ప్రీ బుకింగ్స్‌ జరిగాయి. తాజాగా కంపెనీ కో-ఫౌండర్‌ భవిష్య అగర్వాల్‌ సుమారు లక్ష వరకు ప్రీ బుకింగ్స్‌ జరిగాయని, ఓలా ప్రీ బుకింగ్స్‌ చేసుకున్నవారికి కృతజ్ఙతలను తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో భారత్‌ చరిత్ర సృష్టించనుందని అగర్వాల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఓలా తమిళనాడులోని ఓలా ఫెసిలిటీ సెంటర్‌లో  ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేయనున్నారు. ఈ ఫెసిలిటీ సెంటర్ ప్రపంచంలోని  ఈవీ ఫెసిలిటీ సెంటర్లు కంటే పెద్దది. ఇక్కడ ఏడాదికి ఒక కోటి యూనిట్లను తయారు చేసే సామర్ధ్యం ఉంది. ఇక్కడి నుంచి లాటిన్ అమెరికా, యుకె, న్యూజిలాండ్, ఇతరుల మార్కెట్లకు ఎగుమతులు చేయాలని ఓలా భావిస్తోంది.

మరిన్ని వార్తలు