ఓలా అరుదైన ఫీట్‌, ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే రికార్డ్‌..!

3 Dec, 2021 21:29 IST|Sakshi

దేశియ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ మార్కెట్‌లో ఓలా ఎస్1,ఎస్1ప్రో మోడళ్లతో సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అతి తక్కువ కాలంలో 10లక్షల బుకింగ్స్‌ నమోదు చేసి ప్రత్యర్ధి ఎలక్ట్రిక్‌ ఆటోమొబైల్‌ సంస్థలకు సవాల్‌ విసిరింది. అయితే తాజాగా ఓలా అరుదైన ఫీట్‌ను సాధించింది. ఇప్పటివరకు 20,000 టెస్ట్ రైడ్‌లను పూర్తి చేసింది. 

ఓలా ఎలక్ట్రిక్ నవంబర్ 10న బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కతాలో టెస్ట్ రైడ్‌లను ప్రారంభించింది. నవంబర్ 19న చెన్నై, హైదరాబాద్, కొచ్చి, ముంబై, పూణే వంటి ఐదు నగరాల్లో టెస్ట్ రైడ్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఓలా సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడే 20,000 టెస్ట్ రైడ్‌లను పూర్తి చేశాం. బహుశా ఈ రికార్డ్‌ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక అరుదైన రికార్డుగా నమోదవుతుంది' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.  

మరోవైపు  ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ను అన్ని రకాల రోడ్లపై టెస్టులు నిర్వహించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా 1,000 నగరాల్లో రోజుకు 10,000 టెస్ట్ రైడ్‌లను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భవిష్ అగర్వాల్ తెలిపారు. ఇక,దేశంలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ ను ఏర్పాటు చేయడంలో నిమగ్నమైంది. మొత్తం 400 నగరాల్లో 100,000 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

చదవండి: ఎలక్ట్రిక్‌ వాహన కొనుగోలుదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఓలా..!

మరిన్ని వార్తలు