ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు వాయిదా..?

9 Sep, 2021 18:47 IST|Sakshi

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలను సెప్టెంబర్ 15కు వాయిదా వేసినట్లు ఆ సంస్థ సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు చెందిన వెబ్‌సైట్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల మొదటి దశ ఈవీ అమ్మకాలను సెప్టెంబర్ 15కు వాయిదా వేయాల్సి వచ్చినట్లు సంస్థ పేర్కొంది. ఓలా ఎలక్ట్రిక్ కొన్ని వారాల క్రితం తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ 1ను ఈవీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. భారతీయ ఈవీ మార్కెట్లో ఎన్నో సంచాలనాల మధ్య విడుదలైన ఈ స్కూటర్ వాస్తవానికి సెప్టెంబర్ 8 నుంచి అమ్మకానికి రావాల్సి ఉంది. దీని డెలివరీలు వచ్చే నెల అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్నాయి. (చదవండి: అన్నీ ఎలక్ట్రిక్ వాహన కంపెనీల ఛార్జింగ్ స్టేషన్లు ఒకే యాప్‌లో)

అయితే, కస్టమర్లు కొనుగోలు సమయంలో వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో అమ్మకాల తేదీని సెప్టెంబర్ 15కు ఓలా ఎలక్ట్రిక్ వాయిదా వేయాల్సి వచ్చింది.  ఓలా ఛైర్మన్, గ్రూప్ సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విట్టర్ వేదికగా చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని ప్రకటించారు. "మా ఓలా ఎస్1 స్కూటర్ కొనుగోళ్లు ఈ రోజు నుంచి ప్రారంభించాలని మేము అనుకున్నాము. కానీ దురదృష్టవశాత్తు, మా వెబ్‌సైట్‌లో కొనుగోళ్ల సమయంలో మాకు అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి" అని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అలాగే, "చాలా గంటలు పాటు వేచి ఉండాల్సి వచ్చినందుకు నేను మీ అందరికీ క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. మా వెబ్‌సైట్‌ నాణ్యత మా అంచనాలకు అనుగుణంగా లేదు. మేము మిమ్మల్ని నిరాశపరిచామని మాకు తెలుసు. అందుకే ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా క్షమాపణ లు కోరుతున్నాను" అని అన్నారు.

ఇంకా ఓలా ఎస్1, ఎస్1 ప్రో స్కూటర్ల రిజర్వేషన్, డెలివరీ తేదీ మారకుండా ఉంటుందని ఓలా సీఈఓ వినియోగదారులకు హామీ ఇచ్చారు. “మీ రిజర్వేషన్, కొనుగోలు క్యూలో మీ స్థానం మారదు. కాబట్టి మీరు ముందుగా రిజర్వ్ చేసినట్లయితే, మీరు దానిని ముందుగా కొనుగోలు చేయవచ్చు. మా డెలివరీ తేదీలు కూడా మారవు” అని ఆయన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. కంపెనీ వినియోగదారుల కోసం పూర్తిగా కాగితరహిత డిజిటల్ కొనుగోలు అనుభవాన్ని ప్రవేశపెట్టింది. రుణ ప్రక్రియ కూడా పూర్తిగా డిజిటల్ చేసింది. 
 

>
మరిన్ని వార్తలు