Ola Electric Scooter: ఇంటికే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ

21 Jul, 2021 18:39 IST|Sakshi

ప్రముఖ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ జూలై 15న తన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ ఓపెన్ చేసిన 24 గంటల్లో లక్ష మందికి పైగా బుక్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఇది ఒక రికార్డు. ఓలా కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్న వినియోగదారుల ఇంటికే డోర్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఓలా ఎలక్ట్రిక్ నేరుగా వినియోగదారులకు కొత్త ఈవీ స్కూటర్ అందజేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయం ద్వారా ఓలా ఎలక్ట్రిక్ సంస్థ నేరుగా కస్టమర్లను చేరుకోవాలని చూస్తుంది. సంప్రదాయ డీలర్ షిప్ నెట్ వర్క్ ను ఓలా తొలగించాలని చూస్తున్నట్లు ఫస్ట్ పోస్ట్ నివేదించింది.

ఓలా ఎలక్ట్రిక్ దీనికోసం ఒక ప్రత్యేక లాజిస్టిక్స్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇది ప్రత్యక్ష కొనుగోలు ప్రక్రియను సులభతరం చేస్తుంది. వినియోగదారుల డాక్యుమెంటేషన్, లోన్ అప్లికేషన్, ఇతర సంబంధిత సమాచారాన్ని ఆన్ లైన్ లో పూర్తి చేస్తే విధంగా పోర్టల్ రూపొందిస్తుంది. అదేవిధంగా, ఈ లాజిస్టిక్స్ టీమ్ స్కూటర్ రిజిస్టర్ చేసి నేరుగా కొనుగోలుదారుడి ఇంటికి డెలివరీ చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఈ కొత్త విధానంతో ఓలా విస్తృతమైన రిటైల్ గొలుసును ఏర్పాటు చేయడానికి అవసరమైన వనరులను ఆదా చేయాలని చూస్తోంది. అంటే ఓలా భారతదేశంలోని మెట్రో, టైర్-3 నగరంలోని వినియోగదారుడికి చేరుకోవాలని చూస్తుంది. ఇప్పటి వరకు మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి లగ్జరీ కార్ల తయారీదారులు వినియోగదారులకు వాహనాలను హోమ్ డెలివరీ చేస్తున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1, ఎస్1 ప్రో వేరియెంట్లలో లభ్యం అవుతుందని భావిస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్ ఈ స్కూటర్ ధర సుమారుగా రూ.80,000 నుంచి రూ.1.20 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు