ఎలక్ట్రిక్‌ బైకులకు ఎండాకాలం ఎఫెక్ట్‌.. ఉన్నట్టుండి తగలబడి పోతున్నాయ్‌!

26 Mar, 2022 20:40 IST|Sakshi

పెట్రోల్‌ ధరల నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు కాలుష్యాన్ని తగ్గిస్తుందంటూ చెబుతూ వస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయా? అంటే అవును అనేట్టుగా వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వేసవి కాలం మొదలైందో లేదో ఒకే రోజు తమిళనాడు, మహారాష్ట్రలలో రెండు చోట్ల ఎలక్ట్రిక్‌ స్కూటర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.

పూనే నగరంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓలా ఎలక్ట్రిక్‌ స్కూట​ర్‌ ఎస్‌ 1 ప్రో బైకు అగ్నికి ఆహుతయ్యింది. రోడ్డు పక్కన ఓ షాపు ముందు నిలిపి ఉంచిన స్కూటరు నుంచి ఉన్నట్టుండి పొగలు రావడం మొదలైంది. క్షణాల్లోనే దట్టమైన పొగలు కాస్తా మంటలుగా మారింది. నిమిషాల వ్యవధిలోనే ఓలా స్కూటర్‌ అగ్ని కీలల్లో చిక్కుకుని కాలి మసయ్యింది. అక్కడే ఉన్న స్థానికులు ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు.

దేశ వ్యాప్తంగా ఫుల్‌ క్రేజ్‌ ఉన్న ఓలా స్కూటర్‌ మంటల్లో చిక్కుకుని తగలబడి పోవడం సంచలనంగా మారింది. ఈ స్కూటరులో అమర్చిన లిథియం ఐయాన్‌ బ్యాటరీలో ఎక్సోథెర్మిక్‌ రియాక‌్షన్‌ కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపించాలని.. స్కూటరు డిజైనులో లోపాలు ఉంటే వెంటనే సరి చేయాలని ఓలా స్కూటర్‌ యూజర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

మరోవైపు ఛార్జింగ్‌ పెట్టిన ఎలక్ట్రిక్‌ బైకు మంటల్లో చిక్కుకోవడం కారణంగా ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన శనివారం తమిళనాడులోని వెల్లూర్‌లో చోటు చేసుకుంది. దురైవర్మ అనే ఫోటోగ్రాఫర్‌ ఇటీవలే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొన్నాడు. రాత్రి ఛార్జింగ్‌ పెట్టి నిద్రకు ఉపక్రమించాడు. అయితే షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా స్కూటర్‌కు మంటలు అంటున్నాయి. ఇళ్లంతా పొగ వ్యాపించడంతో దుర్మైవర్మ అతని కూతురు ప్రీతీ మోహాన ఇద్దరు నిద్రలోనే చనిపోయారు. 

ఎలక్ట్రిక్‌ బైకుల తయారీలోకి కొత్త కంపెనీలు తామరతంపలా వచ్చి పడుతున్నాయి. స్కూటర్ల తయారీలో నాసిరకం వస్తువులు వాడటం, ఛార్జింగ్‌ పాయిం‍ట్లు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనే అనుమానాలు ఉన్నాయి. ఇకనైనా ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాలు మార్కెట్‌, తయారీ చేస్తున్న కంపెనీలపై నజర్‌ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.   
 

మరిన్ని వార్తలు