ఓలా స్కూటర్‌ అమ్మకాలు షురూ.. అడ్వాన్స్‌ పేమెంట్‌కి రెడీనా?

15 Sep, 2021 10:42 IST|Sakshi

Ola Electric Scooter Sales: ఎప్పుడెప్పుడు మార్కెట్‌లోకి వస్తుందా అని దేశమంతటా ఆసక్తి నెలకొన్న ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అమ్మకాలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి, ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా ప్రీ బుకింగ్‌ చేసుకున్నవారు ఓలా సైట్‌ ద్వారా తమకు కావాల్సిన స్కూటర్‌ని ఎంపిక చేసుకుంటున్నారు.

సేల్‌ మొదలైంది
ఓలా స్కూటర్‌ని సొంతం చేసుకునేందుకు లక్ష మందికి పైగా ప్రీ బుకింగ్‌ చేసుకున్నారు. వీరిలో స్కూటర్‌ కొనేందుకు ఆసక్తి ఉన్న వారు ఓలా వెబ్‌సైట్‌కి వెళ్లి మోడల్‌, కలర్‌ ఆప్షన్‌లను ముందుగా ఎంచుకోవాలి. ఆ తర్వాత స్కూటర్‌ కొనుగోలుకు సంబంధించిన పేమెంట్‌ ఆప్షన్స్‌ ఈఎంఐలో కొంటున్నారా ? లేదా నేరుగా కొంటున్నారా అనే ఆప్షన్లను ఎంచుకోవాలి. ఓలా స్కూటర్‌కి ఫైనాన్స్‌ చేసేందుకు అనేక సంస్థలు, బ్యాంకులు రెడీగా ఉన్నాయి. ఎస్‌ 1 మోడల్‌కి కనీస డౌన్ పేమెంట్‌ రూ. 2,999 ఉండగా ఎస్‌ ప్రో మోడల్‌కి రూ. 3,199లు గా ఉంది. 

ఓన్లీ అడ్వాన్స్‌ పేమెంట్‌
ఓలా స్కూటర్లను నేరుగా హోం డెలివరీ ద్వారానే కస్టమర్లకు అందిస్తున్నారు. కొనుగోలు సెప్టెంబరు 15న ప్రారంభమైన స్కూటర్‌ డెలివరీ అక్టోబరులో ఉంటుందని ఓలా చెబుతోంది. ఈఎంఐ ఆప్షన్‌ కాకుండా నేరుగా కొనుగోలు చేసేవారు సైతం పుల్‌ పేమెంట్‌ చేయక్కర్లేదని ఓలా తెలిపింది. ఎస్‌ 1 (ధర రూ.99,999) మోడల్‌కి సంబంధించి అడ్వాన్స్‌ పేమెంట్‌గా రూ. 20,000 ఎస్‌ 1 ప్రో (ధర రూ.1,29,999) మోడల్‌కి సంబంధించి అడ్వాన్స్‌ పేమెంట్‌గా రూ. 25,000 చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన డబ్బలును డెలివరీకి ముందు చెల్లించే వెసులుబాటు ఓలా అందిస్తోంది.

ప్రీ బుకింగ్‌ చేయకపోతే ?
జులైలో ప్రీ బుకింగ్‌ చేయని వాళ్లు సైతం ఓలా వెబ్‌సైట్‌ ద్వారా స్కూటర్‌ను కొనుగోలుకు ప్రయత్నించవచ్చు. ఓలా వెబ్‌సైట్‌కి వెళ్లి ప్రీ బుకింగ్‌ టోకెన్‌ అమౌంట్‌ని చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొనుగులకు సంబంధించిన ఇతర ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓలా ప్రీ బుకింగ్‌, అడ్వాన్స్‌పేమెంట్‌కి సంబంధించిన మొత్తం రీఫండబుల్‌, ఎప్పుడైనా ప్రీ బుకింగ్‌ లేదా కొనుగోలు రద్దు చేసుకుంటే డబ్బు వాపస్‌ ఇస్తారు.

ఇబ్బందులు అధిగమించి
ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కి ప్రీ బుకింగ్స్‌ జులైలో ప్రారంభమయ్యాయి. మార్కెట్‌లోకి స్కూటర్‌ రాకముందే లక్షకు పైగా ప్రీ బుకింగ్స్‌ సాధించి రికార్డు సృష్టించింది. సెప్టెంబరు 8న ఈ స్కూటర్‌ అమ్మకాలు ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. అయితే టెక్నికల్‌ ఇష్యూస్‌ తలెత్తడంతో వారం రోజుల పాటు అమ్మకాలు వాయిదా వేశారు. తాజాగా సెప్టెంబరు 15న ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆన్‌లైన్‌ వేదికగా అమ్మకాలు మొదలయ్యాయి. ఈ మేరకు ఓలా చీఫ్‌ భవీష్‌ అగర్వాల్‌ ట్వీట్‌ చేశారు.

చదవండి: ఈవీ ఛార్జింగ్ సమస్యలను సులభంగా చెక్ పెట్టొచ్చు: ఓలా సీఈఓ

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు