అయ్యో  ఓలా ఎలక్ట్రిక్‌: కస్టమర్ల షాక్‌ మమూలుగా లేదుగా!

3 Jul, 2022 16:31 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశంలో ఎలక్ట్రానిక్‌ టూవీలర్స్‌ సెగ్మెంట్‌లో టాప్‌లో ఒక వెలుగు వెలిగిన ఓలా ఎలక్ట్రిక్‌కు వరుసగా మరో షాక్‌ తగిలింది. ఇటీవలి కాలంలో ఎలక్ట్రానిక్‌ వాహనాల అగ్ని ప్రమాదాల నేపథ్యంలో వినియోగదారుల ఆసక్తి భారీగా తగ్గిపోతోంది. అమ్మకాలు లేక వెలవెలబోతోంది. రిజిస్ట్రేషన్లు పతనంతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఓలా రిజిస్ట్రేషన్లు  మే 30తో పోలిస్తే జూన్ 30 నాటికి  30 శాతానికి పైగా తగ్గాయి. 

అయితే ఏప్రిల్,మే నెలల్లో నెలవారీగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు రిజిస్ట్రేషన్లు తగ్గినప్పటికీ జూన్‌లో స్వల్పంగా పెరిగాయి. జూలై 2 నాటి వాహన్ పోర్టల్‌ తాజా సమాచారం ప్రకారం జూన్‌లో నమోదైన మొత్తం ద్విచక్ర వాహనాల ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు)42,233 యూనిట్లుగా ఉన్నాయి.  దీంతో 2022లో ఇప్పటివరకు కేటగిరీలో నమోదైన మొత్తం వాహనాల సంఖ్య 2.4 లక్షల యూనిట్లకు చేరుకుంది.

కానీ భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని ఓలా ఎలక్ట్రిక్  జూన్‌లో  బాగా తగ్గిపోయాయి.  అధికారిక డేటా ప్రకారం జూన్ 30 నాటికి 5,869 ఎలక్ట్రిక్ స్కూటర్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఒకినావా ఆటోటెక్ దేశవ్యాప్తంగా 6,976 వాహనాల రిజిస్ట్రేషన్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆంపియర్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్కూటర్స్ 6,534తో రెండవ స్థానంలో నిలిచింది. 6,486 ఎలక్ట్రిక్ స్కూటర్స్ రిజిస్ట్రేషన్లతో హీరో కంపెనీ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే ఏథర్ ఎనర్జీ 3,797  రిజిస్ట్రేషన్స్, 2,419 రివోల్ట్‌  వాహనాల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఇటీవల ప్రమాదానికి గురైన కంపెనీల్లో ఒకటైన ప్యూర్ ఈవీ రిజిస్ట్రేషన్లు 1125 యూనిట్లకు తగ్గాయి. ఈ ఏడాది మేలో 1,466 యూనిట్లు ఏప్రిల్‌లో 1,757 యూనిట్లను విక్రయించింది. ఒకినావా మేలో 9,302 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది.  ఓలా ఎలక్ట్రిక్ 9,225 యూనిట్ల  ఎస్‌1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేసింది. 

ఇది ఇలా ఉంటే  కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల బ్యాటరీలలో  సెక్యూరిటీ  లోపాలున్నట్టు గుర్తించింది.  ఈ క్రమంలోనే పెరుగుతున్న అగ్ని ప్రమాదాలు, బ్యాటరీ పేలుళ్లు,  బ్యాటరీలలో లోపాలు లాంటి అంశాలపై వివరణ ఇవ్వాల్సిందిగా దాదాపు అన్ని కంపెనీలకు ప్రభుత్వం  నోటీసులిచ్చింది. 

మరిన్ని వార్తలు