ఓలా సరికొత్త బిజినెస్.. 10 నిమిషాల్లో డోర్ డెలివరీ!

30 Nov, 2021 20:19 IST|Sakshi

ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్‌ సేవలు భారీగా పెరిగిపోయాయి. వివిధ రకాల వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్నాయి కంపెనీలు. ఆన్‌లైన్‌ ద్వారా క్యాబ్‌ బుకింగ్‌ సేవలు అందించే ఓలా ఇప్పుడు మరో కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓలా కంపెనీ ఇప్పుడు కిరాణా సరుకుల డోర్ డెలివరీ సేవలు అందిస్తుంది. ఈ బిజినెస్‌లో భాగంగా ఓలా ముంబై, బెంగళూరు అంతటా ఆన్‌లైన్‌ కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించింది. కంపెనీ రోజువారీగా సుమారు 10000 ఆర్డర్లను అందుకున్నట్లు తెలిపింది. బెంగళూరు, ముంబైలోని కొన్ని కీలక ప్రాంతాల్లో 'ఓలా స్టోర్'ను తెరిచింది. రాబోయే నెలల్లో ఇతర నగరాలకు విస్తరించనున్నట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.  

కేవలం 10 నిమిషాల్లో కిరాణా సరుకులు డోర్ డెలివరీ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఓలా యాప్‌ ద్వారా క్విక్ డెలివరీ సేవలు పొందవచ్చు. దాదాపు 2,000 రకాల వస్తువులను ఓలా స్టోర్‌ నుంచి ఆర్డర్ చేయవచ్చు. కిరాణా డెలివరీ వ్యాపారం కోసం ఓలా 250 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తుంది. జనవరి నాటికి కిరాణా సరుకుల ఫాస్ట్ డెలివరీ కోసం 300 ఓలా స్టోర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 55 క్లౌడ్ కిచెన్లను కలిగి ఉన్న ఈ సంస్థ, జనవరి నాటికి ఈ సంఖ్యను 150-160కు విస్తరించాలని యోచిస్తోంది. 2015 జూలైలో రైడ్-హైలింగ్ సంస్థ బెంగళూరులో ఒక స్టాండ్ ఎలోన్ ఆన్‌లైన్‌ కిరాణా దుకాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల తొమ్మిది నెలల కంటే తక్కువ సమయంలోనే ఆ సేవలను మూసివేసింది. రెడ్ సీర్ ప్రకారం, ఈ డోర్ డెలివరీ వ్యాపారం రాబోయే ఐదేళ్లలో 10-15 రెట్లు పెరిగి 2025 నాటికి 5 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది.

(చదవండి: మారుతి సుజుకీలో ఆ కారు ధర మరింత ప్రియం..!)

మరిన్ని వార్తలు