Ola S1 Pro Real Range Test: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ రేంజ్ ఇంతేనా..?

5 Jan, 2022 15:39 IST|Sakshi

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ గత ఏడాది(2021) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రెండు ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ల(ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రొ)ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కూటర్లు ఒక్కరోజులో లక్షకు ప్రీ బుకింగ్ ఆర్డర్స్ అందుకొని రికార్డు సృష్టించాయి. గత నెలలో సంస్థ కస్టమర్లకు ఈ స్కూటర్లను డెలివరీ చేయడం ప్రారంభించింది. అయితే, ఈ స్కూటర్ ఇంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం ఆ స్కూటర్ రేంజ్. ఓలా సంస్థకు చెందిన ఎస్1 ప్రొ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్టింగ్ రేంజ్ వచ్చేసి 181 కిలోమీటర్లు అని కంపెనీ క్లెయిమ్ చేసింది. కానీ, వాస్తవానికి ఈ స్కూటర్ రేంజ్ ఎంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఓలా సంస్థకు చెందిన ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్న యజమాని సిద్ధార్థ్ రెడ్డి ఈ స్కూటర్ రియల్ రేంజ్ వీడియో రికార్డు చేసి "ప్రదీప్ఆన్ వీల్స్" యూట్యూబ్ చానెల్లో అప్ లోడ్ చేశారు. ఈ యూట్యూబ్ వీడియోలో ఎస్1 ప్రొ స్కూటర్ వాస్తవ పరిస్థితులలో ఎంత రేంజ్ అనేది మనం చూడవచ్చు. స్కూటర్ యజమాని సిద్ధార్థ్ రెడ్డి తన ఎలక్ట్రిక్ స్కూటర్ని ఫుల్(100%) చార్జ్ చేసిన తర్వాత రోడ్డు మీదకు టెస్ట్ రైడ్ కోసం బయలుదేరుతాడు. అయితే,  మనం ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ స్కూటర్లో మూడు రైడ్ మోడ్స్(నార్మల్, స్పోర్ట్, హైపర్)ఉన్నాయి అనే విషయం మరిచిపోవద్దు.

ఆటోమేటిక్‌'గా ఎకో మోడ్‌కు పడిపోయిన వేగం
ఈ వీడియోలో తను పేర్కొన్న వివరాల ప్రకారం.. స్పోర్ట్, హైపర్ మోడ్స్ లో ప్రయాణించినట్లు తెలిపాడు. హైవేలపై మీద 60-70 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్లు పేర్కొన్నాడు. 93 కిలోమీటర్లు పాటు విస్తృతంగా ప్రయాణించిన తర్వాత ఈ స్కూటర్ బ్యాటరీ స్థాయి 15 శాతానికి పడిపోయింది. ఆ తర్వాత స్కూటర్ దానంతట అదే "ఎకో" మోడ్‌కు మారుతుంది. ఈ ఎకో మోడ్‌లో స్కూటర్ గరిష్ట వేగం గంటకు 40 కిలోమీటర్లు. ఆ తర్వాత 7 కిమీ ప్రయాణించిన తర్వాత 3 శాతానికి పడిపోయింది. ఆ తర్వాత ఛార్జింగ్ పెట్టాలని స్కూటర్ ఆగిపోయింది.

(చదవండి: ఊసరవెల్లిలా రంగులు మార్చే ఫోన్‌ చూశారా..?)

ఎస్1 ప్రో స్కూటర్ రియల్ రేంజ్
కాబట్టి, మొత్తంగా ఒకసారి ఈ స్కూటర్ని ఫుల్ చార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు వెళ్లనుంది. కానీ, ఇది ఏఆర్ఏఐ ద్వారా పరీక్షించినప్పుడు పొందిన 181 కిలోమీటర్ల రేంజ్ క్లెయిం కంటే చాలా తక్కువ. అయితే, ఎస్1 ప్రో వాస్తవ పరిస్థితులలో 135 కిలోమీటర్లు ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని ఓలా పేర్కొంది. అయితే, ఈ స్కూటర్ మీద 70 కిలోల కంటే ఎక్కువ బరువు లేని ఒకే ఒక వ్యక్తి మాత్రమే ఉండాలి. స్కూటర్ మీద అదనపు లోడ్ తీసుకెళ్లరాదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 8.5 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటార్ కలిగి ఉంది. అంతేకాకుండా 3.92 లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.6 సెకండ్లలో అందుకుంటుంది అని కంపెనీ పేర్కొంది.

మరిన్ని వార్తలు