ఈవీ టూ వీలర్‌ మార్కెట్‌లో నంబర్‌ వన్‌ ఓలా

3 May, 2022 19:42 IST|Sakshi

వివాదాలు ఎన్ని చుట్టు ముట్టినా ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ క్రేజ్‌ తగ్గడం లేదు. కస్టమర్‌ సర్వీస్‌ చెత్తగా ఉందంటూ రోజుకు ఫిర్యాదులు వస్తున్నా అదే స్థాయిలో స్కూటర్‌ బుకింగ్స్‌ జరిగిపోతున్నాయి. మొత్తంగా మార్కెట్‌లోకి వచ్చిన ఆర్నెళ్లలోపే దేశంలో నంబర్‌ వన్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌గా ఓలా అవతరించింది.

2021 ఆగస్టు 15న ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బుకింగ్స్‌ మొదలయ్యాయి. ఆ తర్వాత అక్టోబరు చివరి వారం నుంచి డెలివరీలు చేస్తున్నారు. గత ఆరేడు నెలల కాలంలో దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఓలా స్కూటర్ల అమ్ముడయ్యాయి. ముఖ్యంగా ప్రభుత్వ వెబ్‌సైట్‌ వాహన్‌లో ఉన్న వివరాల ప్రకారం 2022 ఏప్రిల్‌లో 12,869 ఓలా స్కూటర్లు దేశవ్యాప్తంగా రిజిస్టర్‌ అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న హీరో ఎలక్ట్రిక్‌ రెండో స్థానానికి పడిపోయింది.

ఓలా తర్వాత స్థానంలో 10,000 టూ వీలర్ల రిజిస్ట్రేషన్లతో ఒకినావా ద్వితీయ స్థానంలో ఉంది. ఇక యాభై శాతం అమ్మకాలు పడిపోగా ఏప్రిల్‌లో హీరో ఎలక్ట్రిక్‌ 6,571 స్కూటర్ల అమ్మకాలు జరిపి మూడో స్థానానికి పరిమితమైంది. నాలుగో స్థానంలో అథర్‌, ఐదో స్థానంలో యాంపియర్‌ ఈవీలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఓలా సీఈవీఓ భవిశ్‌ అగర్వాల్‌ స్పందిస్తూ.. ప్రత్యర్థి కంపెనీలు మాపై చెడు ప్రచారం చేయడం ఆపి వాళ్ల పని వాళ్లు చూసుకుంటే బెటర్‌ అంటూ ట్వీట్‌ చేశారు.

ఓలా ఎలక్ట్రిక్‌ కారు రూ.10 లక్షలు?
త్వరలోనే ఎలక్ట్రిక్‌ కారు మార్కెట్‌లోకి తెస్తామంటూ ఓలా ప్రకటించింది. ఇండస్ట్రీ వర్గాల అంచానా ప్రకారం ఈ కారు 2023 చివర్లో లేదంటే 2024 ఫస్ట్‌ క్వార్టర్‌లో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తి దేశీయంగా తయారు చేసిన ఈ ఈవీ కారుని ఓలా పరిక్షీస్తోంది. మార్కెట్‌లో వచ్చే నాటికి ఒక కారు ధర కనిష్టంగా రూ. 10 లక్షల దగ్గర ఉండేలా ఓలా జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం.
 

చదవండి: Ola Electric: అగ్ని ప్రమాదాల కలకలం...ఓలా ఎలక్ట్రిక్‌ కీలక నిర్ణయం..!

మరిన్ని వార్తలు