కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్లు

27 Apr, 2022 16:54 IST|Sakshi

దేశ ప్రజలు ముఖ్యంగా టూ వీలర్‌ ఉన్న వారిలో నూటికి తొంభై మంది ఎలక్ట్రిక్‌ బైకులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇందులో కొందరు ఇప్పటికే వివిధ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్‌ స్కూటర్లను కొనుగోలు చేశారు. కానీ నాణ్యతా లోపాలు, సమస్యకు పరిష్కారం చూపని కస్టమర్‌ కేర్‌ సర్వీసులతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఓ కస్టమర్‌ ఈవీ స్కూటర్‌ వల్ల ఎదురవుతున్న ఒత్తిడి తట్టుకోలేక పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. 

తమిళనాడులో అంబుర్‌కి చెందిన ప​ృధ్విరాజ్‌ వైద్యుడిగా పని చేస్తున్నాడు. 2022 జనవరిలో ఓలా స్కూటర్‌ అతనికి డెలివరీ అయ్యింది. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొనుక్కున సంతోషం అతనిలో ఎక్కువ కాలం నిలవలేదు. బ్యాటరీ మేనేజ్‌మెంట్‌లో లోపాల కారణంగా ఆ స్కూటర్‌ దారి మధ్యలోనే ఆగిపోయేది. కంపెనీ సింగిల్‌ ఛార్జ్‌తో 181 కిలోమీటర్ల దూరం వస్తుందని చెప్పగా ఎప్పుడూ 60 కి.మీలకు మించి వచ్చింది లేదని పృధ్విరాజ్‌ అంటున్నాడు. 90 పర్సంట్‌ చూపించే బ్యాటరీ క్షణాల్లోనే జీరోకి చేరుకునేది. దీంతో ఎన్నోసార్లు నడిరోడ్డుపై నిలబడి పోవాల్సి వచ్చేది.

కస్టమర్‌ కేర్‌ విఫలం
ఈ క్రమంలో అనేక సార్లు తన స్కూటర్‌ సమస్యను పరిష్కరించాలంటూ పృధ్విరాజ్‌ ఓలా కస్టమర్‌ కేర్‌ను వేడుకున్నాడు. వందల కొద్ది కాల్స్‌, మెసేజ్‌ చేశారు. కానీ అక్కడి నుంచి స్పందన రాలేదు. ఆఖరికి సోషల్‌ మీడియాలో ఓలా సీఈవో భవీష్‌ అగర్వాల్‌ను ట్యాగ్‌ చేస్తేనే అప్పుడప్పుడు రెస్పాన్స్‌ వచ్చేది. కానీ సమస్యకు పరిష్కారం మాత్రం దొరికేది కాదు. 

ఒత్తిడి భరించలేక
ఇలా అనేక ఇబ్బందుల నడుమ ఓలా స్కూటర్‌తో ప్రయాణం చేస్తున్నాడు పృధ్విరాజ్‌. ఈ క్రమంలో 2022 ఏప్రిల్‌ 26న ఓలా స్కూటర్‌తో బయటకు వెళ్లగా దారి మధ్యలో బ్యాటరీ ఛార్జింగ్‌ అయిపోయి వాహనం ఆగిపోయింది. తనకు తక్షణ సాయం అందివ్వాలంటూ ఎంతగా వేడుకున్నా ఓలా కస్టమర్‌ కేర్‌ నుంచి సరైన స్పందన రాలేదు. నడిరోడ్డులో అది ఎండాకాలం మిట్టమధ్యాహ్నం ఆగిపోయిన బైకుతో గంటల తరబడి ఎదురు చూసినా ఫలితం రాకపోవడంతో పృధ్విరాజ్‌లో ఆక్రోషం కట్టలు తెంచుకుంది. నాలుగు నెలలుగా పడుతున్న ఇబ్బందులకు ఏదో రకంగా పులిస్టాప్‌ పెట్టాలని డిసైడ్‌ అయ్యాడు. దీంతో రెండు లీటర్ల పెట్రోలు కొనుక్కుని వచ్చి ఓలా స్కూటర్‌పై పోసి ఆ తర్వాత నిప్పంటించాడు. మంటల్లో కాలిపోతున్న స్కూటర్‌ను వీడియో తీశాడు. 

దృష్టి పెట్టండి
ఓలా స్కూటర్‌తో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, ఓలా కస్టమర్‌ కేర్‌ స్పందించిన తీరును ఏకరువు పెడుతూ ట్విటర్‌లో ఫోటోలు, స్క్రీన్‌షాట్స్‌తో సహా షేర్‌ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఈ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. బ్యాటరీ పేలిపోవుడు సమస్యలకు తోడు కొత్తగా కస్టమర్‌ సపోర్ట్‌ అందివ్వడంలోనూ ఈవీ సంస్థలు విఫలమవుతున్నాయనే అభిప్రాయం నెలకొంటుంది. ఇప్పటికైనా ఈవీ సంస్థలు వాహనాల నాణ్యత, కస్టమర్‌ సపోర్ట్‌పైన దృష్టి పెడితే మంచిది.

చదవండి: మా దగ్గర డబ్బులు తీసుకుని.. మా ఇబ్బందులు పట్టించుకోరా ?

మరిన్ని వార్తలు