Ola Play Shut Down: ‘ఒక్కో బిజినెస్ షట్‌డౌన్‌’..అనుకున్నది సాధిస్తున్న ఓలా సీఈవో భవిష్‌ అగర్వాల్‌!

13 Nov, 2022 09:33 IST|Sakshi

ప్రముఖ రైడ్‌ షేరింగ్‌ సంస్థ ఓలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా క్యాబ్స్‌ ప్రయాణంలో కస్టమర్లకు అందించే ఓలా ప్లే సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 

ఓలా 2016లో క్యాబ్‌లో ప్రయాణించే కస్టమర్ల కోసం క్లౌడ్‌ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే టాటా ప్లే సర్వీసుల్ని ప్రారంభించింది. ప్రయాణంలో ప్యాసింజర్లు వారికి నచ్చిన మ్యూజిక్‌ వినొచ్చు. ఎంటర్టైన్మెంట్ వీడియోల్ని వీక్షించొచ్చు. క్యాబ్‌ ప్రయాణాన్ని ట్రాక్‌ చేయొచ్చు. అయితే తాజాగా ఓలా నవంబర్‌ 15నుంచి కస్టమర్లకు ఆ సదుపాయాల్ని అందివ్వబోమని స్పష్టం చేసింది. తన బిజినెస్‌ ఫోకస్‌ అంతా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌పై పెడుతున్నట్లు తెలిపింది. కాబట్టే ఖర్చును తగ్గిస్తూ ఆదాయం లేని సర్వీసుల్ని నిలిపి వేస్తుంది. ఉద్యోగుల్ని తొలగిస్తుంది.  

ప్రారంభించిన ఏడాది లోపే 
సీఈవో భవిష్‌ అగర్వాల్‌ ఓలా డాష్‌ పేరుతో గ్రాసరీ డెలివరీ మార్కెట్‌లో అడుగు పెట్టారు. కస్టమర్లు ఆర్డర్‌ చేసిన నిత్యవసర సరకుల్ని 10 నుంచి 15 నిమిషాల్లో డెలివరీ చేస్తామని ఆ సందర్భంగా ప్రచారం చేశారు. ప్రచారం, బ్రాండ్‌ కలిసి రావడంతో ఓలా డాష్‌ వ్యాపారం బాగానే జరిగింది. కానీ భవిష్‌ ఓలా ఎలక్ట్రిక్‌పై దృష్టిసారించడంతో క్విక్‌ కామర్స్‌ బిజినెస్‌ నష్టాల బాట పట్టింది. వెరసీ బిజినెస్‌ ప్రారంభించిన ఏడాది లోపే షట్‌డౌన్‌ చేశారు.

ఉద్యోగుల తొలగింపు 
ఓలా డాష్‌ షట్‌డౌన్‌ తర్వాత ఓలా ఎలక్ట్రిక్‌ పేరుతో ఈవీ మార్కెట్‌లో అడుగుపెట్టారు. ఓలా ఎస్‌1, ఓలా ఎస్‌1 ప్రో వెహికల్స్‌ను ఆటోమొబైల్‌ మార్కెట్‌కు పరిచయం చేశారు. కానీ ఓలా ఈవీపై క్రియేట్‌ అయిన హైప్‌ కారణంగా కొనుగోలు దారుల అంచనాల్ని అందుకోలేకపోయింది. ఒకానొక దశలో ఓలా వెహికల్స్‌ అగ్నికి ఆహుతవ్వడం, చిన్నచిన్న రోడ్డు ప్రమాదాలకే ఆ వెహికల్స్‌ పార్ట్‌లు ఊడిపోవడంతో అప్రతిష్టను మూటగట్టుకుంది. దీంతో ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గారు. ఖర్చు తగ్గించుకునేందుకు భవిష్‌ అగర్వాల్‌ గట్టి ప్రయత్నాలే చేశారు. ఒక్కో బిజినెస్‌ కార్యకలాపాల్ని నిలిపివేశారు. కాస్ట్‌ కటింగ్‌ పేరుతో 400 నుంచి 500 మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపారు. ఇలా భవిష్‌ అగర్వాల్‌ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా.. చివరికి అనుకున్నది సాధిస్తున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

టార్గెట్‌ యూరప్‌ 
దేశీయంగా 2021 డిసెంబర్‌ నుంచి 2022 నవంబర్ మధ్య కాలానికి ఏకంగా లక్ష వెహికల్స్‌ను తయారు చేశారు. నవంబర్‌ 24 కల్లా కోటి ఈవీ బైక్స్‌ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో అంతర్జాతీయ ఈవీ మార్కెట్‌పై భవిష్‌ అగర్వాల్‌ కన్నేశారు. ఓలా ఎలక్ట్రిక్‌ ఇప్పటికే నేపాల్‌కు ఈవీ వెహికల్స్‌ను ఎగుమతులు ప్రారంభించింది.ప్రస్తుతం యూరప్‌ దేశమైన ఇటలీలో జరుగుతున్న ఎస్పోసిజియోన్ ఇంటర్నేషనల్ సిక్లో మోటోసిక్లో ఇ యాక్సెసోరి (EICMA) మోటర్‌ సైకిల్‌ షోలో ఓలా ఎస్‌1 ప్రోను ప్రదర్శిస్తున్నట్లు భవిష్‌ ట్వీట్‌ చేశారు. వచ్చే ఏడాది క్యూ1లో యూరప్‌ కంట్రీస్‌లో భారత్‌ నుంచి వరల్డ్‌ ఈవీ ప్రొడక్ట్‌ను అందిస్తామని పునరుద్ఘాటించారు.

చదవండి👉 ‘బండ్లు ఓడలు ..ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’!

మరిన్ని వార్తలు