సంచలనం: ఓలా, ఉబెర్‌, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం

7 Oct, 2022 18:52 IST|Sakshi

బెంగళూరు: క్యాబ్‌ సర్వీసుల సంస్థలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్‌లైన ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం విధించింది. నిబంధనలు పాటించకుండా, చట్ట  విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ సర్కార్‌ మూడు రోజుల్లో సేవలను నిలిపివేయాలని  ఓలా, ఉబెర్‌, ర్యాపిడోలను ఆదేశించింది. కర్ణాటక రవాణా శాఖ వాహన అగ్రిగేటర్లకు నోటీసులు జారీ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

ఓలా, ఉబెర్‌లు రెండు కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ఉన్నప్పటికీ కనీసం రూ. 100 వసూలు చేస్తున్నాయని పలువురు ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో  ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.  ఈ మేరకు  రవాణా శాఖ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలను ధిక్కరించి అగ్రిగేటర్లు సేవలను నిర్వహిస్తున్నారు. అదనంగా, ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువ ధరలను వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ టిహెచ్‌ఎం కుమార్ నోటీసులో పేర్కొన్నారు.

ఆటో సర్వీసులను నిలిపివేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీల కంటే ఎక్కువ చార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేయకూడదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కనీస ఆటో ఛార్జీ మొదటి 2 కి.మీకి రూ.30, ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.15గా నిర్ణయించారు. ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీల కంటే క్యాబ్‌లలో ప్రయాణికుల నుంచి ఎక్కువ ఛార్జీలు వసూలు చేయవద్దని నోటీసులో సూచించారు. ఆదేశాలను పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటా మని  కూడా ఆయన  హెచ్చరించారు. 

>
మరిన్ని వార్తలు