Bhavish Aggarwal: ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్‌ స్కూటర్లు కొన్నవారికి సీఈఓ భవిష్ అగర్వాల్ శుభవార్త..!

16 Jan, 2022 17:47 IST|Sakshi

Bhavish Aggarwal: ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్‌ స్కూటర్లు కొన్నవారికి సంస్థ సీఈఓ భవిష్ అగర్వాల్ శుభవార్త చెప్పారు.  ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులను తన ఓలా ఎస్1 ప్రో స్కూటర్ల హార్డ్‌వేర్'కు అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపారు. అగర్వాల్ ట్విట్టర్ వేదికగా ఇలా ఒక ప్రకటన చేశారు.. "మీరు ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించిన అన్నీ ఫీచర్లను పొందుతారు. ప్రో రేంజ్, హైపర్ మోడ్, ఇతర ఫీచర్లను కూడా అన్ లాక్ చేయవచ్చు, తదుపరి డెలివరీలు జనవరి & ఫిబ్రవరిలో ఉంటుంది. కస్టమర్లకు అన్ని వివరాలతో ఈ-మెయిల్ వస్తుందని" ఆయన తెలిపారు.

ఎలక్ట్రిక్ స్కూటర్లను గత ఏడాది లాంచ్ చేసిన తర్వాత ఈ-స్కూటర్ల డెలివరీ ఆలస్యం కావడంతో వినియోగదారుల నుంచి ఒత్తిడి అధికంగా వచ్చింది. దీంతో ఓలా ఎలక్ట్రిక్ డిసెంబర్ 16, 2021న మొదటి దశలో కొన్ని స్కూటర్ల డెలివరీ చేసింది. అయితే, కంపెనీ తన ప్రొడక్ట్, సర్వీస్ విషయంలో అనేక ప్రశ్నలను ఎదుర్కొంటోంది. డిజిటల్ కీ, రివర్స్ మోడ్ వంటి చాలా హైప్ చేసిన ఫీచర్లు జూన్ 2022 నాటికి మాత్రమే అందుబాటులో ఉంటాయని వినియోగదారులకు చెప్పారు. దీంతో సోషల్ మీడియాలో కంపెనీకి వ్యతిరేకంగా అనేక మంది కస్టమర్లు ట్విట్స్ చేశారు. భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓలా గత ఏడాది ఆగస్టు 15న తన ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రారంభించింది. ఓలా ఎస్1 ధర రూ.99,999 కాగా, ఓలా ఎస్1 ప్రో ధర రూ.1,29,999గా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలపై వారు అందించే సబ్సిడీలను బట్టి స్కూటర్ల ధరలు వివిధ రాష్ట్రాల్లో మారుతుంది.


 

మరిన్ని వార్తలు