ఒలెక్ట్రాకు ఎంఎస్‌ఆర్‌టీసీ నుంచి 100 బస్సులకు ఆర్డరు 

10 Nov, 2021 04:13 IST|Sakshi

కాంట్రాక్టు విలువ రూ. 250 కోట్లు 

క్యూ2లో ఆదాయం 38 శాతం అప్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్‌ఆర్‌టీసీ) నుంచి 100 ఎలక్ట్రిక్‌ లగ్జరీ బస్సులకు ఆర్డరు లభించినట్లు ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ దిగ్గజం ఒలెక్ట్రా వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఒలెక్ట్రా, ఈవీ ట్రాన్స్‌ కన్సార్షియంనకు లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌ (ఎల్‌వోఏ) అందినట్లు తెలిపింది. ఈ కాంట్రాక్టు విలువ సుమారు రూ. 250 కోట్లు. రాబోయే 10 నెలల వ్యవధిలో వీటిని అందించాల్సి ఉంటుంది. ఈ బస్సులను ముంబై–పుణె మధ్య నడుపుతారు.

కొత్త ఆర్డరుతో ఒలెక్ట్రా ఆర్డర్ల సంఖ్య 1,550కి చేరింది. మరోవైపు, సీతారాంపూర్‌ పారిశ్రామిక పార్కు ప్లాంటులో ఉత్పత్తి 2022–23 నుంచి ప్రారంభం కాగలదని ఒలెక్ట్రా చైర్మన్‌ కేవీ ప్రదీప్‌ వెల్లడించారు. అత్యాధునికమైన పూర్తి స్థాయి ఆటోమేటెడ్‌ ప్లాంటులో ఏటా 10,000 పైచిలుకు ఎలక్ట్రిక్‌ బస్సులు తయారు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో ట్రక్కులు, త్రిచక్ర వాహనాలు, తేలికపాటి.. మధ్య స్థాయి వాణిజ్య వాహనాలు కూడా ఉత్పత్తి చేస్తామని తెలిపారు. దీనితో ఉపాధి అవకాశాలు పెరగగలవని, ఎకానమీ వృద్ధికి కూడా ఇతోధికంగా తోడ్పడగలదని ప్రదీప్‌ వివరించారు. ఒలెక్ట్రాకు రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలోని సీతారాంపూర్‌ పారిశ్రామిక పార్కులో.. టీఎస్‌ఐఐసీ 150 ఎకరాల స్థలం కేటాయించింది.  

రూ. 69 కోట్లకు ఆదాయం.. 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఆదాయం 38 శాతం పెరిగి రూ. 69 కోట్లకు చేరింది. గత క్యూ2లో ఇది రూ. 50 కోట్లు. 2020 రెండో త్రైమాసికంలో ఏడు బస్సులు సరఫరా చేయగా తాజా క్యూ2లో 18 ఎలక్ట్రిక్‌ బస్సులను సరఫరా చేసినట్లు, పుణెలో కార్యకలాపాల ఊతంతో నిర్వహణ ఆదాయం మరింత పెరిగినట్లు సంస్థ తెలిపింది. ఎలక్ట్రిక్‌ బస్సుల విభాగం ఆదాయం రూ. 17.8 కోట్ల నుంచి రూ.42.1 కోట్లకు పెరగ్గా, ఇన్సులేటర్స్‌ విభాగం మాత్రం 17 శాతం క్షీణించిందని పేర్కొంది. సమీక్షాకాలంలో కంపెనీ నికర లాభం రూ. 2.3 కోట్ల నుంచి రూ. 3.71 కోట్లకు చేరింది. 

మరిన్ని వార్తలు