SBI Card: ఎస్‌బీఐ కార్డ్‌ లాభాలు రెట్టింపు

27 Apr, 2021 12:40 IST|Sakshi

ఎస్‌బీఐ కార్డ్‌ లాభం రెట్టింపు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో క్రెడిట్‌ కార్డ్‌ల కంపెనీ ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ నికర లాభం రెట్టింపైంది. రూ. 175 కోట్లుగా నమోదైంది. 2019–20నాలుగో క్వార్టర్‌లో ఇది రూ. 84 కోట్లు. తాజా క్యూ4లో మొత్తం ఆదాయం రూ. 2,510 కోట్ల నుంచి రూ. రూ. 2,468 కోట్లకు తగ్గింది. వ్యయాలు రూ. 2,398 కోట్ల నుంచి రూ. 2,234కోట్లకు దిగివచ్చాయి. మరోవైపు పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను నికర లాభం 21 శాతం క్షీణించి రూ. 1,245 కోట్ల నుంచి రూ. 985 కోట్లకు తగ్గింది. స్థూల మొండిబాకీలు (ఎన్‌పీఏ) రెట్టింపై 2.01 శాతం నుంచి 4.99 శాతానికి పెరగ్గా.. నికర ఎన్‌పీఏలు 0.67 శాతం నుంచి 1.15 శాతానికి చేరాయి.  

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ భారీ ఆర్డర్‌
మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు (ఎంఈఐఎల్‌) చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ కంపోజిట్‌ పాలిమర్‌ ఇన్సులేటర్ల సరఫరాకై రూ.30 కోట్ల విలువైన ఆర్డర్లను చేజిక్కించుకుంది. వీటిలో ఓ అమెరికన్‌ కంపెనీ నుంచి రూ.15 కోట్లు, భారత్‌కు చెందిన పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ నుంచి రూ.15 కోట్ల ఆర్డర్‌ ఉంది. ప్రస్తుతం ఆర్డర్‌ బుక్‌ రూ.60 కోట్లుఉందని ఒలెక్ట్రా ఇన్సులేటర్స్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ బాలయ్య తెలిపారు. మరో రూ.30 కోట్ల ఆర్డర్లు కొన్ని నెలల్లో చేజిక్కించుకోనున్నట్టు చెప్పారు. 

సాగర్‌ సిమెంట్స్‌లో ఎస్‌సీఆర్‌ఎల్‌ విలీనం 
అనుబంధ కంపెనీ సాగర్‌ సిమెంట్స్‌ (ఆర్‌) లిమిటెడ్‌ను (ఎస్‌సీఆర్‌ఎల్‌) మాతృ సంస్థలో విలీనం చేసే ప్రతిపాదనకు బోర్డు సమ్మతి తెలిపిందని సాగర్‌ సిమెంట్స్‌ సోమవారం ప్రకటించింది. ఎస్‌సీ ఆర్‌ఎల్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌ జిల్లా గుడిపాడు వద్ద సిమెంటు తయారీతోపాటు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఉంది. ఎస్‌సీఆర్‌ఎల్‌గా పేరు మారినకర్ణాటకకు చెందిన బీఎంఎం సిమెంట్స్‌లో 100% వాటాలను 2015–16లో సాగర్‌ సిమెంట్స్‌ చేజిక్కించుకుంది. 

మరిన్ని వార్తలు