పోర్టర్‌కు 5,000 ఈ–కార్గో వాహనాలు

28 Sep, 2022 06:35 IST|Sakshi

ముంబై: ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో ఉన్న ఒమెగా సీకి మొబిలిటీ భారీ ఆర్డర్‌ను అందుకుంది. ఇందులో భాగంగా సరుకు రవాణా రంగంలో ఉన్న పోర్టర్‌కు 5,000 ఎలక్ట్రిక్‌ కార్గో త్రిచక్ర వాహనాలను సరఫరా చేయనుంది. వచ్చే ఏడాది చివరినాటికి ఈ వెహికిల్స్‌ను డెలివరీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పోర్టర్‌ వద్ద 1,000 ఎలక్ట్రిక్‌ త్రీవీలర్లు ఉన్నాయి.

ఈ–కామర్స్‌ కంపెనీల నుంచే కాకుండా ఎఫ్‌ఎంసీజీ, డెయిరీ, నిర్మాణ, వాహన విడిభాగాల వంటి రంగాల నుండి కూడా డిమాండ్‌ రావడంతో ట్రక్కుల అవసరం పెరిగిందని ఒమెగా సీకి మొబిలిటీ ఫౌండర్, చైర్మన్‌ ఉదయ్‌ నారంగ్‌ తెలిపారు. ‘2023లో ఎలక్ట్రిక్‌ ద్విచక్ర, త్రిచక్ర వాహన విభాగంలో 200 శాతం వృద్ధి ఆశిస్తున్నాం. పోర్టర్‌తో భాగస్వామ్యం గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. ఇటువంటి డీల్స్‌ మరిన్ని కుదుర్చుకోనున్నాం. వచ్చే 2–3 ఏళ్లలో డీల్స్‌లో భాగంగా భాగస్వామ్య కంపెనీలకు 50,000 వెహికిల్స్‌ సరఫరా చేసే అవకాశం ఉంది’ అని వివరించారు. ఈ–కామర్స్‌ కంపెనీలు పండగల నెలలో రూ.96,170 కోట్ల విలువైన వ్యాపారం నమోదు చేసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.  

మరిన్ని వార్తలు