వర్క్‌ఫ్రమ్‌ హోం: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌! డామిట్.. కంపెనీల కథ అడ్డం తిరిగింది

6 Jan, 2022 13:44 IST|Sakshi

మన దేశంలో ఒమిక్రాన్‌ వేరియెంట్‌ విజృంభణ ఆల్రెడీ మొదలైంది. తారాస్థాయికి చేరడానికి వారం నుంచి పది లేదంటే పదిహేనురోజులు పట్టొచ్చనేది ఒక అంచనా. డామిట్‌.. జనవరి(2022) నుంచి ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించాలనే కంపెనీల ప్రయత్నాలకు పెద్ద విఘాతమే కలిగింది. మరి వర్క్‌ఫ్రమ్‌ హోం ముగిసేది ఎప్పుడు? ఉద్యోగులు ఆఫీసుల్లో సందడి చేసేదెన్నడు? అనే విషయంపై విశ్లేషకుల అంచనాలు...    


కరోనా సంక్షోభం ఎదురైన తర్వాత వచ్చిన ‘వర్క్‌ఫ్రమ్‌ హోం’లో ఉద్యోగుల పర్‌ఫార్మెన్స్‌ మెరుగ్గా ఉన్నప్పటికీ.. ఈ విధానం క్లయింట్ల కోణంలో, ప్రొడక్టివిటీ కోణంలో బెడిసి కొట్టింది. దీంతో చాలా కంపెనీలు ఈ విధానం ఆపే యోచనలో ఉన్నాయి. అందుకే వర్క్‌ ఫ్రం హెంకి స్వస్తి చెప్పేందుకు మల్టీ నేషనల్‌ కంపెనీలకు తమ ఉద్యోగులకు ప్రత్యేకంగా వ్యాక్సిన్లు అందించాయి. నిరాకరించిన వారికి హెచ్చరికలు సైతం జారీ చేశాయి. కొత్త ఏడాది ఫస్ట్‌ క్వార్టర్‌లో ఎప్పుడైనా ఆఫీస్‌కి వర్క్‌కి రావాల్సి ఉంటుందంటూ సూచన ప్రాయంగా ఉద్యోగులకు సమాచారం అందించాయి.

ఇళ్లే పదిలం
ఉద్యోగుల ఫీడ్‌బ్యాక్‌ తెలుసుకునేందుకు నవంబర్‌ చివరి వారంలో పలు సంస్థలు సర్వేలు చేపట్టాయి. 67 శాతం మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం పద్దతికే మొగ్గు చూపారు. కంపెనీలు మాత్రం ఆఫీస్‌ వర్క్‌కి ప్రాధాన్యం ఇచ్చాయి. చివరకు మధ్యేమార్గంగా ఇళ్లు, ఆఫీస్‌లతో హైబ్రిడ్‌ పద్దతిని తెర మీదకు తెచ్చాయి కొన్ని కంపెనీలు. మరి కొన్ని కంపెనీలు ఆఫీస్‌ మెయింటనెన్స్‌ ఖర్చు తగ్గుతుందని భావించిన ఉద్యోగుల నిర్ణయానికే మద్దతు పలుకుతూ వర్క్‌ ఫ్రం హోంకి జై కొట్టాయి. 

ఒమిక్రాన్‌తో మళ్లీ మొదటికి
నవంబరు చివరి వారంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వెలుగు చూసింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది. దీంతో దక్షిణాఫ్రికా మొదలు వరుసగా ఒక్కో దేశం తిగిరి ఆంక్షల వలయంలోకి వెళ్లిపోతోంది. మరోవైపు కేంద్ర, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోం వెసులుబాటుతో పాటు కొన్ని సడలింపులూ ఇస్తున్నాయి. దీంతో కంపెనీలు ఆఫీస్‌ రిటర్న్‌ పాలసీ విషయంలో వెనక్కి తగ్గాయి. అయితే ఎన్నాళ్లు మళ్లీ ఈ వర్క్‌ ఫ్రం హోం అమలు చేస్తారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

సమ్మర్‌ దాకా తప్పదా?
ఒమిక్రాన్‌ దక్షిణాఫ్రికా, అమెరికా, యూకేలో చూపిన ప్రభావం ఆధారంగా వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ విషయంలో నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం జనవరి చివరి వారంలో ఒమిక్రాన్‌ కేసులు తారాస్థాయికి చేరే అవకాశం ఉంది. అక్కడి నుంచి మరో ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు అంటే ఫిబ్రవరి, మార్చిలలో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. దీంతో ఫస్ట్‌ క్వార్టర్‌ మొత్తం వర్క్‌ ఫ్రం హోం విధానమే కొనసాగించేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి. 

అదే జరిగితే.. 
కరోనా ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌ల ప్రభావాన్ని మన దేశంలో పరిశీలిస్తే... మార్చి-జులై మధ్యకాలంలోనే కేసులు, మరణాలు ఎక్కువగా వచ్చాయి. శీతాకాలంలో వైరస్‌ విజృంభిస్తుందని వైద్యులు చెప్పినా మన దగ్గర మాత్రం వేసవిలో ఎక్కువ ప్రభావం చూపింది. గత రెండు వేవ్‌ల అనుభవాల దృష్ట్యా సెకండ్‌ క్వార్టర్‌ వరకు కూడా వర్క్‌ ఫ్రం హోం విధానమే తప్పదేమో అనే భావన క్రమంగా కంపెనీ యాజమాన్యాల్లో బలపడుతోంది. 

ఈసారి అలా ఉండదు
ఒమిక్రాన్‌ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న తీవ్రత తక్కువగా ఉంటోంది. దీంతో 2022 తొలి త్రైమాసికం ముగిసేలోపు ఒమిక్రాన్‌ ఉధృతి తగ్గినా, ​కొత్త వేరియెంట్‌ తెర మీదకు వచ్చినా(ప్రమాదతీవ్రత లేకుంటేనే!) పట్టించుకోవద్దని కొన్ని కంపెనీలు భావిస్తున్నాయి.  సగం లేదంటే పూర్తిస్థాయి కుదరకుటే హైబ్రిడ్‌ విధానం ద్వారా అయినా ‘వర్క్‌ఫ్రమ్‌ హోం’కు ముగింపు పలకాలని అనుకుంటున్నాయి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ కీలక ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. 

అసలైన పరీక్ష ఇప్పుడే
గత రెండు వేవ్‌ల సందర్భాల్లో వ్యాక్సినేషన్‌ నామామాత్రంగానే జరిగింది. ఇక వైద్య వ్యవస్థ పూర్తిగా సిద్ధం కాలేదు. కానీ సెకండ్‌ వేవ్‌ ఎఫెక్ట్‌తో వ్యాక్సినేషన​ గణనీయంగా పెరిగింది. ఉద్యోగుల్లో నూటికి 90 శాతం మంది కనీసం ఒక్క డోసైనా తీసుకున్నారు. మరోవైపు హస్పిటల్‌ రంగంలో కరోనా ట్రీట్‌మెంట్‌కి తగ్గట్టు మౌలిక వసతులు, ట్యాబెట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఒమిక్రాన్‌ ఒక్కటే కాకుండా మిగిలిన వేరియంట్లను సమాజం ఎలా ఎదుర్కొంటుందనే దానిపై స్పష్టత రానుంది. ఆ తర్వాతే వర్క్‌ ఫ్రం హోం, హైబ్రిడ్‌ విధానంపై నిర్థిష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

ఏతావతా 2022 మొదటి త్రైమాసికం వర్క్‌ ఫ్రం హోం తప్పని పరిస్థితి ఉండగా, రెండో త్రైమాసికం పరిస్థితిపై ఇంకా సరైన అంచనాలు లేవు.

-సాక్షి, వెబ్‌స్పెషల్‌

మరిన్ని వార్తలు