స్టార్‌ లింక్‌కు షాక్.. శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌పై ఎయిర్‌టెల్‌ కీలక అడుగు..!

20 Jan, 2022 14:13 IST|Sakshi

మన దేశంలో అందరి కంటే ముందుగా శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించాలని చూసిన స్టార్‌ లింక్‌కు గట్టి షాక్ తగిలింది. స్టార్‌ లింక్‌ కంటే ముందే దేశంలో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల్ని అందించేందుకు వన్ వెబ్ సిద్దం అవుతుంది. ఆ దిశగా అడుగులు కూడా వేస్తుంది. మన దేశంలో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల్ని అంధించడానికి ప్రముఖ నెట్వర్క్ సంస్థ భారతి ఎయిర్‌టెల్, యుకె ప్రభుత్వ గ్లోబల్ కమ్యూనికేషన్ నెట్ వర్క్ వన్ వెబ్, బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ హ్యూస్ వ్యూహాత్మక ఆరు సంవత్సరాల భాగస్వామ్య ఒప్పందం మీద సంతక చేశాయి. 

శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్లో భాగంగా భారతీ ఎయిర్‌టెల్‌తో కలిసి హైదరాబాద్‌కి చెందిన హ్యూస్‌ కమ్యూనికేషన్స్‌ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ జాయింట్‌ వెంచర్‌లో ఎయిర్‌టెల్‌ సుమారు 33 శాతం, హ్యూస్‌ కమ్యూనికేషన్స్‌ 67 శాతం వాటాలను కల్గి ఉన్నాయి. వీరు సంయుక్తంగా ఏర్పాటుచేసిన జాయింట్‌ వెంచర్‌ భారత్‌లో శాటిలైల్‌ ఇంటర్నెట్‌ సేవలను అందించనున్నారు. ముఖ్యంగా ఫైబర్ కనెక్టివిటీ లేని మారుమూల ప్రాంతాల్లో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వన్ వెబ్ నెట్వర్క్ పట్టణాలు, గ్రామాలు, స్థానిక & ప్రాంతీయ మున్సిపాలిటీలలోని కష్టతరమైన ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించగలదు అని కంపెనీలు ఒక ప్రకటనలో తెలిపాయి.

2022 చివరలో ప్రారంభం
శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల కోసం ఎయిర్‌టెల్‌, హ్యూస్‌ కమ్యూనికేషన్స్‌తో 2019లోనే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇరు కంపెనీల ‘వెరీ స్మాల్ అపెర్చర్‌ టెర్మినల్‌ (VSAT)’ వ్యాపారాలను ఇకపై కలిపేయనున్నట్లు పేర్కొన్నాయి. భారత్‌లో అతిపెద్ద శాటిలైజ్ సర్వీస్‌ ఆపరేటర్‌గా హ్యూస్‌ కమ్యూనికేషన్స్‌  నిలుస్తోంది. బ్యాంకింగ్‌, ఏరోనాటికల్‌, మేరీటైమ్‌ మొబిలిటీ, విద్య, టెలికాం వంటి రంగాల్లో సేవలందిస్తోంది. శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వల్ల దేశంలోని లడఖ్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి ఈశాన్యం వరకు భారతదేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాల్లో శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించవచ్చు అని వన్ వెబ్ సీఈఓ నీల్ మాస్టర్సన్ తెలిపారు. ఈ శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల 2022 చివరి నాటికి ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 

(చదవండి: Gold Price: పసిడి పరుగో పరుగు.. తులం ఎంతంటే?)

>
మరిన్ని వార్తలు