ఓఎన్‌జీసీ లాభం హైజంప్‌

14 Feb, 2022 09:03 IST|Sakshi

క్యూ3లో రూ. 8,764 కోట్లు 

ఆదాయం 67 శాతం జూమ్‌ 

న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్‌జీసీ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలను సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం ఆరు రెట్లుకపైగా(597 శాతం) దూసుకెళ్లి రూ. 8,764 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 1,258 కోట్లు ఆర్జించింది. ఇంధన ఉత్పత్తి తగ్గినప్పటికీ భారీగా బలపడిన చమురు, గ్యాస్‌ ధరలు అధిక లాభాలకు దోహదం చేశాయి. ముడిచమురు విక్రయాలలో ఒక్కో బ్యారల్‌కు 75.73 డాలర్ల ధర లభించగా.. గత క్యూ3లో 43.2 డాలర్లు చొప్పున మాత్రమే ఆర్జించింది. ఇక గ్యాస్‌ ధరలు సైతం ఒక్కో ఎంబీటీయూకి 2.9 డాలర్లు చొప్పున ఆర్జించింది. గత క్యూ3లో 1.79 డాలర్లు మాత్రమే లభించింది. కాగా.. కంపెనీ బోర్డు వాటా దారులకు షేరుకి రూ. 1.75 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. ఇంతక్రితం 2021 నవంబర్‌లో షేరుకి రూ. 5.5 చొప్పున తొలి డివిడెండును చెల్లించింది. 

తగ్గిన ఉత్పత్తి 
ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం 67 శాతం జంప్‌చేసి రూ. 28,474 కోట్లను తాకింది. ఈ కాలంలో చమురు ఉత్పత్తి 3.2 శాతం తగ్గి 5.45 మిలియన్‌ టన్నులకు పరిమితమైంది. గ్యాస్‌ ఉత్పత్తి సైతం 4.2 శాతం నీరసించి 4.5 బిలియన్‌ ఘనపు మీటర్లకు పరిమితమైంది. ప్రధానంగా తౌకటే తుఫాన్, కోవిడ్‌–19 ప్రభావాలతో చమురు ఉత్పత్తి తగ్గినట్లు కంపెనీ పేర్కొంది.  

చదవండి: స్థిరాస్తులపై కొత్త నిబంధనలు..అమ్మకాలు, కొనుగోలు చేసేటప్పుడు..

మరిన్ని వార్తలు