ఓఎన్‌జీసీకి చమురు లాభాలు

30 May, 2022 06:23 IST|Sakshi

మార్చి క్వార్టర్‌కు రూ.8,859 కోట్లు

న్యూఢిల్లీ: ఆయిల్, గ్యాస్‌ అన్వేషణ ఉత్పత్తి సంస్థ ఓఎన్‌జీసీ మార్చి త్రైమాసికానికి రూ.8,859 కోట్ల స్టాండలోన్‌ లాభాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధరలు కంపెనీ లాభాల వృద్ధికి అనుకూలించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలం లో లాభం రూ.6,734 కోట్లతో పోల్చి చూస్తే 30 శాతానికి పైగా వృద్ధి చెందినట్టు తెలుస్తోంది. షేరు వారీ ఆర్జన మార్చి క్వార్టర్‌కు రూ.7.04గా ఉంది. ఆదాయం రూ.34,497 కోట్లకు దూసుకుపోయింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.21,189 కోట్లతో పోలిస్తే 50 శాతానికి పైగా పెరిగింది.

ఇక 2021–22 ఆర్థిక సంవత్సరానికి ఓఎన్‌జీసీ లాభం రికార్డు స్థాయిలో రూ.40,306 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.11,246 కోట్లతో పోలిస్తే మూడు రెట్లు వృద్ధి చెందింది. 2021 చివర్లో చమురు ధరలు పెరగడం మొదలు కాగా.. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తర్వాత ధరలు మరింత ఎగిశాయి. చమురు, గ్యాస్‌ ఉత్పత్తి చేసే ఓఎన్‌జీసీకి ఇది అనుకూలించింది. అనుబంధ సంస్థలైన హెచ్‌పీసీఎల్, ఓఎన్‌జీసీ విదేశ్‌ లిమిటెడ్‌ ఫలితాలను కూడా కలిపి చూస్తే.. కన్సాలిడేటెడ్‌ లాభం మార్చి త్రైమాసికంలో రూ.12,061 కోట్లు, 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.49,294 కోట్లుగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు