ఓఎన్‌జీసీతో టోటల్‌ఎనర్జీస్‌ జట్టు

7 Mar, 2023 06:00 IST|Sakshi

న్యూఢిల్లీ: చమురు, గ్యాస్‌ క్షేత్రాల్లో కొత్త నిక్షేపాల వెలికితీతకు అవసరమైన సాంకేతిక సహకారం కోసం ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ అంతర్జాతీయ సంస్థలతో చేతులు కలుపుతోంది. ఇందులో భాగంగా తాజాగా మహానది, అండమాన్‌ క్షేత్రాలకు సంబంధించి ఫ్రాన్స్‌కి చెందిన టోటల్‌ఎనర్జీస్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. సముద్ర లోతుల్లో నిక్షేపాల అన్వేషణకు కావాల్సిన సాంకేతిక సహకారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ (ఓఎన్‌జీసీ) ట్విటర్‌లో వెల్లడించింది.

ఎక్సాన్‌మొబిల్, షెవ్రాన్‌ వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో ఓఎన్‌జీసీ ఇప్పటికే ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇవన్నీ ఇంకా పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చాల్సి ఉంది. ఓఎన్‌జీసీకి వివిధ ప్రాంతాల్లో గ్యాస్, చమురు నిక్షేపాల వెలికితీత, ఉత్పత్తికి లైసె న్సు ఉంది. అయితే, కంపెనీకి కేటాయించిన క్షేత్రా ల్లో ఉత్పత్తి తగ్గిపోతుండటంతో పాటు కొత్తగా మరే నిక్షేపాలు ఇటీవలి కాలంలో బైటపడటం లేదు. దీంతో సంక్లిష్టమైన క్షేత్రాల్లో గ్యాస్, చమురు నిల్వలను అన్వేషించేందుకు, ఉత్పత్తిని పెంచుకునేందుకు ఓఎన్‌జీసీ ఇతర సంస్థలతో జట్టు కడుతోంది. 

మరిన్ని వార్తలు