ఓఎన్‌జీసీ రూ. లక్ష కోట్ల పెట్టుబడులు

30 May, 2023 08:33 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్‌ ఉత్పత్తి దిగ్గజం ఓఎన్‌జీసీ 2030 నాటికి ఇంధన పరివర్తన ప్రాజెక్టులపై రూ. 1 లక్ష కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. 2038 నాటికి నెట్‌ జీరో ఎమిషన్స్‌ (కర్బన ఉద్గారాల విడుదల, తగ్గింపు మధ్య సమతౌల్యం పాటించడం) లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తద్వారా నెట్‌ జీరో ఎమిషన్స్‌కు మార్గదర్శ ప్రణాళికలను వేసుకుంటున్న తోటి సంస్థలు ఇండియన్‌ ఆయిల్, హిందుస్తాన్‌ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్‌), గెయిల్, భారత్‌ పెట్రోలియం (బీపీసీఎల్‌) మొదలైన వాటి సరసన చేరనుంది. కంపెనీ చైర్మన్‌ అరుణ్‌ కుమార్‌ సింగ్‌ ఈ విషయాలు వెల్లడించారు.

తాము అంతర్గతంగా నెట్‌–జీరోపై కసరత్తు చేసి 2038 లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఆయన తెలిపారు. 2030 నాటికి పునరుత్పాదక వనరుల ద్వారా విద్యుదుత్పత్తిని 189 మెగావాట్ల నుంచి 1 గిగావాట్లకు పెంచుకోవాలని ఓఎన్‌జీసీ నిర్దేశించుకుంది. ఇప్పటికే రాజస్థాన్‌లో 5 గిగావాట్ల ప్రాజెక్టును ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉండగా.. అదే స్థాయిలో మరో ప్రాజెక్టును నెలకొల్పే అంశం పరిశీలనలో ఉన్నట్లు సింగ్‌ వివరించారు. మంగళూరులో వార్షికంగా 1 మిలియన్‌ టన్నుల గ్రీన్‌ అమోనియా ప్లాంటును ఏర్పాటు చేయడంపైనా దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. వీటన్నింటికీ మొత్తం మీద రూ. 1 లక్ష కోట్ల వరకు పెట్టుబడులు ఉంటాయని సింగ్‌ వివరించారు. 

ఆయిల్‌ ఉత్పత్తి అప్‌.. 
2022–23లో ఓఎన్‌జీసీ 19.584 మిలియన్‌ టన్నుల (ఎంటీ) చమురు ఉత్పత్తి చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 21.263 ఎంటీకి, తదుపరి 21.525 ఎంటీ, ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో 22.389 ఎంటీకి చేరనుంది. 2021–22లో చమురు ఉత్పత్తి 19.545 ఎంటీగా నమోదైంది. మరోవైపు సహజ వాయువు ఉత్పత్తి 2022–23లో 20.636 బీసీఎం (బిలియన్‌ ఘనపు మీటర్లు)గా ఉండగా, 2023–24లో 23.621 బీసీఎం, తర్వాత ఏడాది 26.08 బీసీఎం, 2025–26లో 27.16 బీసీఎంకు చేరనుంది. తూర్పు, పశ్చిమ తీరాల్లోని ప్రాజెక్టుల్లో ఉత్పాదకతను పెంచుకోవడంతో పాటు కొత్త నిక్షేపాలను కూడా అభివృద్ధి చేస్తుండటంతో ఉత్పత్తి పెరగడానికి దోహదపడుతోంది.

ఇదీ చదవండి: ఆర్‌క్యాప్‌ నష్టాలు తగ్గాయ్‌

మరిన్ని వార్తలు