దేశంలో పెరిగిన గ్యాస్‌ ధరలు, ఓఎన్‌జీసీ..రిలయన్స్‌కు లాభాలే లాభాలు!

6 Apr, 2022 12:09 IST|Sakshi

న్యూఢిల్లీ: సహజవాయువు ధరలు రెట్టింపు కావడం, చమురు ధరల పెరుగుదల ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ వంటి చమురు, గ్యాస్‌ ఉత్పత్తి సంస్థలకు (అప్‌స్ట్రీమ్‌ కంపెనీలు) భారీ లాభాలను తెచ్చిపెట్టనున్నట్లు ఫిచ్‌ రేటింగ్స్‌ తన నివేదికలో పేర్కొంది. 

ఓఎన్‌జీసీ వంటి సంస్థలు ఉత్పత్తి చేసే గ్యాస్‌ రేటును యూనిట్‌కు 2.9 డాలర్ల నుంచి 6.10 డాలర్లకు, సంక్లిష్ట క్షేత్రాల నుండి రిలయన్స్‌ వంటి కంపెనీలు వెలికితీసే గ్యాస్‌ ధరను యూనిట్‌కు 6.1 డాలర్ల నుండి 9.92 డాలర్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 1 నుండి ఇవి ఆరు నెలల పాటు అమల్లో ఉంటాయి. దేశీయ గ్యాస్, చమురు ధర నిర్ణయం గత 12 నెలల్లో నాలుగు గ్లోబల్‌ లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ బెంచ్‌మార్క్‌ల ధరలపై ఆధారపడి ఉంటుంది. వీటి ఆధారంగా తాజా ధరల పెరుగుదలకు సంబంధించి ఫిచ్‌  మంగళవారంనాటి విశ్లేషణలను పరిశీలిస్తే.. 

 భారత ప్రభుత్వం సహజవాయువు ధరలను పెంచడంతోపాటు, 2022లో బ్రెంట్‌ ముడి చమురు ధర బ్యారల్‌ అంచనాలను గత 70 డాలర్ల నుంచి 100 డాలర్లకు, 2023లో 60 డాలర్ల నుంచి 80 డాలర్లకు  పెంచింది.  ఈ నిర్ణయం ఫిచ్‌ రేటింగ్‌ ఇస్తున్న భారత్‌ అప్‌స్ట్రీమ్‌ కంపెనీల లాభదాయకత, అలాగే వారి పెట్టుబడి వ్యయ పటిష్టత, వాటాదారుల డివిడెండ్‌ పంపిణీల వంటి అంశాలకు మద్దతును అందిస్తుంది.  

► అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో,  తాజా ధరల పెంపు ముందు ఊహించిందే. అక్టోబర్‌ 2022లో తదుపరి ధర నిర్ణయంలో రేట్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నాం. అధిక గ్యాస్‌ ధరల స్థితి కొనసాగుతుందని భావించడం దీనికి కారణం.  

► అధిక గ్యాస్‌ ధరలు ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ క్రెడిట్‌ రేటింగ్‌ పెరగడానికి దోహదపడుతుంది. అలాగే ఆ సంస్థ మూలధనం తన అనుబంధ సంస్థ– నుమాలిగర్‌ రిఫైనరీ లిమిటెడ్‌ సామ ర్థ్యాన్ని విస్తరించేందుకు దోహదపడుతుంది.  

► కేజీ బేసిన్‌ నుండి గ్యాస్‌ ఉత్పత్తి చేసే రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీలు ధరల పరిమితి (లోతైన నీరు, ఇతర క్లిష్టమైన క్షేత్రాలకు) పెంపు నుండి ప్రయోజనం పొందుతాయి. మొత్తం రాబడి పెరుగుదలకు కొంత మేర ఈ నిర్ణయం దోహదపడుతుంది. క్రెడిట్‌ ప్రొఫైల్స్‌  రెండు సంస్థలు పటిష్టంగా కొనసాగనున్నాయి.  

► అధిక చమురు, గ్యాస్‌ ధరలు– వినియోగ రంగంలోకి తయారీ సంస్థలపై ముడి పదార్థాల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. రవాణా వంటి కీలక రంగాలకు ఈ బిల్లు భారంగా మారే వీలుంది.  

► దేశీయంగా ఉత్పత్తి చేయబడిన గ్యాస్‌.. కొన్ని రంగాలకు ప్రాధాన్యతా ప్రాతిపదికన సరఫరా అవుతుంది.  2020–21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఉత్పత్తిలో విద్యుత్‌ ఉత్పత్తిదారులు 30 శాతం, ఎరువుల రంగం దాదాపు 27 శాతం, సిటీ–గ్యాస్‌ పంపిణీదారులు 19 శాతం వినియోగించారు. 

► గ్యాస్‌ ధరల పెరుగుదల వల్ల ఎరువుల రంగం వర్కింగ్‌–క్యాపిటల్‌ అవసరాలను పెంచుతుంది. ఈ రంగం లాభదాయకతను ఈ నిర్ణయం దెబ్బతీస్తుంది.  పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా అధిక దిగుమతి వ్యయాలను కూడా ఈ రంగం ఎదుర్కొంటుంది. 

► ఆటో గ్యాస్‌ ఇంధన ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఇది ద్రవ ఇంధనాల ధరలకు సంబంధించి పోటీ తత్వాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. 

కేంద్రం తాజా పెంపు నిర్ణయం వల్ల  గ్యాస్‌ ఆధారిత పవర్‌ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది.ఇది వినియోగదారుపై ప్రభావం చూపే అంశం.  

మోర్గాన్‌ స్టాన్లీదీ ఇదే మాట... 
దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను కేంద్రం పెంచడంతో ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ, ప్రైవేట్‌ రంగ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) గణనీయంగా ప్రయోజనం పొందుతాయని ఆర్థిక సేవల దిగ్గజం– మోర్గాన్‌ స్టాన్లీ కూడా అంచనా వేస్తోంది.  ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) వార్షిక ఆదాయం 3 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 23,000 కోట్లు), రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆదాయం 1.5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 11,500 కోట్లు) మేర పెరగవచ్చని ఆ సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. 

మార్కెట్లో నిల్వలు, పెట్టుబడులు తగ్గడం మరోవైపు దాదాపు దశాబ్దం తర్వాత దేశీయంగా సహజ వాయువు ఉత్పత్తి పెరుగుతుండటం ఆయిల్‌ కంపెనీల లాభాలకు తోడ్పడనుందని తెలిపింది. గ్యాస్‌ ధర యూనిట్‌కు 1 డాలర్‌ పెరిగితే ఓఎన్‌జీసీ ఆదాయాలు 5–8 శాతం మేర పెరుగుతాయని అంచనా. మార్కెట్లో గ్యాస్‌ కొరత నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్‌లో మరోసారి నిర్వహించే ధరల సమీక్షలో గ్యాస్‌ రేటును ఇంకో 25 శాతం మేర కేంద్ర ప్రభుత్వం పెంచవచ్చని కూడా మోర్గాన్‌ స్టాన్లీ తన నివేదికలో విశ్లేషించింది.  

మరిన్ని వార్తలు