రిటైల్‌ 4.0తో కోటికి పైగా కొత్త కొలువులు

9 Mar, 2021 06:02 IST|Sakshi

125 బిలియన్‌ డాలర్లకుపైగా ఎగుమతులకు అవకాశం

ఆన్‌లైన్‌+ఆఫ్‌లైన్‌ విధానంతో సాధ్యం: నాస్కామ్‌ నివేదిక

న్యూఢిల్లీ: రిటైల్‌ రంగానికి సంబంధించి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానాలు రెండూ కలిస్తే గణనీయంగా కొత్త కొలువులు వచ్చేందుకు, ఎగుమతులనూ పెంచుకునేందుకు అవకాశం లభించనుంది. కన్సల్టింగ్‌ సంస్థ టెక్నోపాక్‌తో కలిసి దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు ఉన్నాయి. రిటైల్‌ 4.0 పేరిట రూపొందించిన ఈ నివేదిక ప్రకారం ఆన్‌లైన్‌ + ఆఫ్‌లైన్‌ విధానంతో కొత్తగా 1.2 కోట్ల మేర కొత్త కొలువులు రాగలవు. అలాగే రిటైల్‌ ఎగుమతులు 125 బిలియన్‌ డాలర్ల దాకా పెరగగలవని అంచనా. గడిచిన దశాబ్దకాలంలో భారత రిటైల్‌ మార్కెట్‌ మూడు రెట్లు వృద్ధి చెందింది. 2019–20లో భారత స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో రిటైల్‌ రంగం వాటా 10% దాకా ఉండగా, 3.5 కోట్ల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ‘కోవిడ్‌–19 అనేది ఒక అగ్నిపరీక్షలాంటిది. డిజిటల్‌ మాధ్యమాన్ని అందిపుచ్చుకో వడం, వేగవంతంగా ఆన్‌లైన్‌ వైపు మళ్లడం ద్వారా దేశీ రిటైల్‌ రంగం ఈ సంక్షోభం నుంచి మెరుగ్గానే బైటపడగలిగింది‘ అని నివేదిక పేర్కొంది.  

మార్కెట్‌ వృద్ధి..: నివేదిక ప్రకారం .. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి దేశీ రిటైల్‌ మార్కెట్‌ 1.5 లక్షల కోట్ల డాలర్లకు చేరనుంది. 2.5 కోట్ల మేర కొత్త కొలువులు రానున్నాయి. ఇందులో సగభాగం వాటా ఆఫ్‌లైన్‌+ఆఫ్‌లైన్‌ విధానానిదే ఉండనుంది. 1.2 కోట్ల కొలువులు, 125 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఎగుమతులు దీన్నుంచి రానున్నాయి. అలాగే, మొత్తం రిటైల్‌ రంగం కట్టే పన్నుల్లో ఈ విభాగం వాటా 37 శాతం దాకా ఉండనుంది.

సాంకేతికత ఊతం..: రాబోయే రోజుల్లో రిటైల్‌ రంగం వృద్ధి చెందడంలో టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుందని నివేదిక ఆవిష్కరణ సందర్భంగా నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ వ్యాఖ్యానించారు. దేశీయంగా రిటైల్‌ వ్యాపారానికి అనువైన పరిస్థితులు కల్పించేందుకు కేంద్రం జాతీయ రిటైల్‌ వాణిజ్య విధానాన్ని రూపొందించే ప్రయత్నాల్లో ఉందన్నారు. రిటైల్‌ 4.0 ప్రయోజనాలు పొం దేందుకు రిటైల్‌ వర్గాలతో పాటు విధాన నిర్ణేతలు, అనుబంధ పరిశ్రమలు కలిసి రావాలని నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ దేవయాని ఘోష్‌ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు