ఈసారి ఈ–కామర్స్‌కు పండుగే..!

19 Sep, 2020 05:46 IST|Sakshi

పండుగ సీజన్‌ అమ్మకాలకు రెట్టింపు అవకాశం 

కోవిడ్‌–19తో పెరిగిన డిజిటల్‌ లావాదేవీలు

కస్టమర్లను ఆకర్షిస్తున్న భారీ ఆఫర్లు

న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగ సీజన్‌ ఈ కామర్స్‌ కంపెనీల సంబరాలను రెట్టింపు చేసే అవకాశం ఉంది. ఈసారి ఆన్‌లైన్‌ అమ్మకాలు రెండింతలు ఉండొచ్చని రెడ్‌సీర్‌ రీసెర్చ్‌ నివేదిక చెబుతోంది. గతేడాది ఈ–కామర్స్‌ కంపెనీలు సాధించిన గ్రాస్‌ మర్చండైజ్‌ వాల్యూ(జీఎంవీ) 3.8 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఈ ఏడాది జీఎంవీ 7 బిలియన్‌ డాలర్లుగా ఉండవచ్చని నివేదిక సర్వే అంచనా వేసింది. ఆన్‌లైన్‌ షాపింగ్‌ పోర్టల్‌ ద్వారా జరిగే లావాదేవీల స్థూల విలువను జీఎంవీగా పిలుస్తారు.  

ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు డిమాండ్‌ ఇందుకే..  
కోవిడ్‌–19 తర్వాత కస్టమర్లు గతంలో కంటే సురక్షితమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన రీతిలో షాపింగ్‌ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ కామర్స్‌ సంస్థలు అలాంటి సదుపాయాల కల్పనను సిద్ధం చేసుకున్నాయి. ఇందులో భాగంగా వీడియో, వాట్సాప్‌ ఆధారిత షాపింగ్‌ విధానంతో ఈ కామర్స్‌ కంపెనీలు కొత్త షాపింగ్‌ విధానానికి తెరతీశాయి. మా సర్వేలో అధిక శాతం కస్టమర్లు ఆన్‌లైన్‌ కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారు’’ అని రీసెర్చ్‌ సంస్థ తెలిపింది.

కస్టమర్లను ఆకర్షిస్తున్న ఆఫర్లు..
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్, షాప్‌క్లూస్‌ వంటి ఈ కామర్స్‌ సంస్థలు ఉత్పత్తులను భారీ ఆఫర్లను ప్రకటించి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా ఈ ఏడాది పండుగ సీజన్‌ తొలి రోజుల్లోనే గతేడాది మొత్తం ఆన్‌లైన్‌ కస్టమర్ల సంఖ్యను అధిగమించవచ్చని సర్వే అంచనా వేస్తుంది.  

కోవిడ్‌–19తో పెరిగిన డిజిటల్‌ లావాదేవీలు:  
మాల్స్, రిటైల్‌ అవుట్‌లుక్‌ లాంటి అధిక సంచారం కలిగిన ప్రాంతాలకు వెళ్లి షాపింగ్‌ చేసేందుకు ఇప్పటికీ ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా ఆఫ్‌లైన్‌ అమ్మకాల రికవరీ ఇంకా బలహీనంగా నే ఉన్నట్లు సర్వే తెలిపింది. కిందటేడాది ఆన్‌లైన్‌ ద్వారా 40–50 మిలియన్‌ మంది షాపింగ్‌ చేశారు. కోవిడ్‌–19 డిజిటల్‌ లావాదేవీలను మరింత పుంజుకునేలా చేసింది. సంప్రదాయ ఆఫ్‌లైన్‌ వినియోగదారుల్ని, ఆన్‌లైన్‌కు మళ్లించింది. ఫలితంగా ఈ పండుగ సీజన్‌లో ఆన్‌లైన్‌ వినియోగదారులు ఏకంగా 70శాతం పెరిగే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.    

సర్వేలో మరికొన్ని అంశాలు..  
బలమైన జాతీయవాద మనోభావంతో కేంద్రం ఇచ్చిన ఆత్మనిర్భర్‌ నినాదంతో ఎలక్ట్రానిక్స్, మొబైల్‌ వంటి విభాగాల్లో కస్టమర్లు ‘‘బ్రాండ్‌’’ను పెద్దగా పట్టించుకోవడంలేదని సర్వే తెలిపింది.  లాక్‌డౌన్‌తో ఉత్పత్తి ఆగిపోవడంతో మొబైల్, అప్లికేషన్లు గతేడాదితో పోలిస్తే డిమాండ్‌ కాస్త తక్కువగా ఉంటుందని సర్వే అంచనా వేసింది. గృహోపకరణాలకు డిమాండ్‌ ఉంటుదని సర్వే చెబుతోంది.  

మరిన్ని వార్తలు