ఆన్‌లైన్‌లో ఆడేస్తున్నారు!!

2 Jul, 2021 04:03 IST|Sakshi

లాక్‌డౌన్‌లో భారీగా పెరిగిన గేమింగ్‌

2020 మూడో త్రైమాసికంలో 290 కోట్లకు డౌన్‌లోడ్స్‌

40 కోట్లకు గేమర్స్‌ సంఖ్య

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూల కారణంగా ఇళ్లకే పరిమితమవ్వాల్సిన పరిస్థితుల్లో చాలా మంది.. కాస్త టైమ్‌ పాస్‌ కోసం ఆన్‌లైన్‌ గేమ్స్‌ వైపు మళ్లుతున్నారు. ప్రస్తుతం దేశీయంగా ప్రాథమిక స్థాయిలోనే ఉన్న గేమింగ్‌ రంగానికి ఇది వరంగా మారుతోంది. కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ నివేదిక ప్రకారం 2020 తొలి త్రైమాసికంలో దేశీయంగా మొబైల్‌ గేమ్స్‌ డౌన్‌లోడ్స్‌ 200 కోట్ల లోపే ఉండగా.. మూడో త్రైమాసికంలో ఏకంగా 290 కోట్లకు పెరిగాయి.

ఇక 2018 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 25 కోట్లుగా ఉన్న గేమర్స్‌ సంఖ్య గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి 40 కోట్లకు పెరిగింది. తద్వారా చైనా తర్వాత అత్యధికంగా ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడేవారున్న రెండో దేశంగా భారత్‌ నిల్చింది. తొలి సారి విధించిన లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత కార్యకలాపాలు యథాప్రకారం ప్రారంభమయ్యాక.. గేమర్స్‌ దూకుడు కాస్త తగ్గినప్పటికీ, ఈ ధోరణి మాత్రం కొనసాగే అవకాశాలే ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. నెలవారీ యాక్టివ్‌ యూజర్ల (ఎంఏయూ) సంఖ్య ఇప్పటికీ కోవిడ్‌–పూర్వ స్థాయికి మించి నమోదవుతుండటమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.  

2025 నాటికి 66 కోట్లకు యూజర్లు..
ఇదే ధోరణి కొనసాగితే 2025 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్‌లో గేమింగ్‌ యూజర్ల సంఖ్య 65.7 కోట్లకు చేరుతుందని అంచనా. అలాగే ఈ రంగానికి సంబంధించిన ఆదాయాలు ప్రస్తుతం రూ. 13,600 కోట్లుగా ఉండగా 2025 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 29,000 కోట్లకు చేరవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లు అందుబాటు ధరల్లో లభ్యమవుతుండటం, డేటా చార్జీలు చౌకగా ఉండటం తదితర అంశాలు గేమింగ్‌ రంగం మరింత విస్తరించడానికి తోడ్పడుతున్నాయి. మెట్రో నగరాలు, ప్రథమ శ్రేణి నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోకి కూడా ఆన్‌లైన్‌ గేమ్స్‌ క్రమంగా చొచ్చుకుపోతున్నాయి.

ఆన్‌లైన్‌ గేమింగ్‌పై సామాజికంగా ఉండే విముఖత తొలగిపోతోందని, మహిళా గేమర్స్‌ సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని కేపీఎంజీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక కొత్త యూజర్లకి చేరువయ్యేందుకు డెవలపర్లు స్థానిక కంటెంట్‌కు ప్రాధాన్యమిస్తుండటం కూడా గేమింగ్‌ సంస్కృతి విస్తరించడానికి దోహదపడుతోందని వివరించాయి. ఆక్ట్రో సంస్థకు చెందిన తీన్‌ పత్తీ, గేమెషన్‌ తయారు చేసిన లూడో కింగ్‌ లాంటి ప్రాచుర్యం పొందిన గేమ్స్‌ను హిందీ, గుజరాతీ, మరాఠీ లాంటి ప్రాంతీయ భాషల్లోనూ ఆడే సౌలభ్యం ఉంటోందని పేర్కొన్నాయి.  

ఇన్వెస్టర్ల ఆసక్తి..
గేమింగ్‌కి ప్రాచుర్యం పెరిగే కొద్దీ .. గేమ్‌ డెవలపర్స్‌ సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ఇన్వెస్టర్లు సైతం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. 2020 ఆగస్టు – 2021 జనవరి మధ్య కాలంలో దాదాపు 544 మిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు గేమింగ్‌ రంగంలోకి వచ్చాయి. స్థానిక కంపెనీలు తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు, అంతర్జాతీయ మార్కెట్లలోకి కూడా ప్రవేశించేందుకు ఈ నిధులు తోడ్పడగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 5జీ టెక్నాలజీ గానీ అందుబాటులోకి వచ్చిన పక్షంలో క్లౌడ్‌ గేమింగ్‌ కూడా ప్రాచుర్యంలోకి రాగలదని వారు తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు